మైండ్‌ఫుల్‌నెస్‌తో అంతా ప్రశాంతం!

ఆంధ్రజ్యోతి,05-04-2017: కొందరికి చిన్ననాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు కలగజేసే బాధను అనుభవిస్తూనే ఉంటారు. వీటిని తొలగించుకోవటానికి మైండ్‌ఫుల్‌నెస్‌ ఒక సమర్థమైన సాధనం అంటుంది బౌద్ధమతం.

 
అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయేదాకా మనలోని ఆలోచనలను మెదడు రికార్డు చేస్తూ ఉంటుంది. ఆ జ్ఞాపకాలు పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇవి బాధకరమైనవి అయితే తీవ్ర ఆందోళన మొదలవుతుంది. కొందరికైతే అప్పటి పరిస్థితులు గుర్తుకొచ్చి కన్నీళ్లు వస్తాయి. మూడ్‌ అంతా పాడైపోతుంది. ఇలాంటి స్థితికి పరిష్కారం మైండ్‌ఫుల్‌నెస్‌. అంటే మనను మనం గమనించుకొని.. మన సమస్యలకు పరిష్కారం కనుగొనటం. సాధారణంగా చిన్నప్పుడు అందరూ శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను వారు ఎదుర్కోలేకపోవచ్చు.
 
ఆ నిస్సహాయత వల్ల కలిగే భావనలు మనలో గాఢంగా నాటుకుపోతాయి. ఆ తరహా నిస్సహాయత ఎప్పుడు ఎదురయినా- చిన్ననాటి సమస్యలను మళ్లీ మెదడు గుర్తు చేస్తుంది. ఈ సమస్యలు గుర్తుకు రాకుండా ఉండటానికి ప్రయత్నించాలా? లేక ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనాలా? అనేది చాలా మందిలో సందిగ్దావస్థగా మిగిలిపోతుంది. చాలా మంది చిన్ననాటి సమస్యలను పట్టించుకోకుండా వదిలేయటానికి ప్రయత్నిస్తారు. అంటే పరిష్కారం కనుగొనటానికి విముఖత చూపిస్తున్నట్లే కదా.. అలా కాకుండా ఆ బాల్య స్మృతులను వెలికితీసి వాటికి ఒక పరిష్కారం చూపిస్తే ఎప్పుడూ బాధ కలగదు. మన చుట్టుపక్కల ఉన్నవారికి సమస్యలు వచ్చినప్పుడు వాటికి నిస్పాక్షికమైన పరిష్కారాలను వెతకటానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తామో.. దీనికి కూడా అలాంటి ప్రయత్నమే జరగాలి.
 
‘‘గతంలో నిన్ను ఒంటరిగా వదిలేసాను. అప్పుడు సమస్యను పరిష్కరించటానికి నాకు శక్తి లేదు. చాలా కాలం గడిచిపోయింది. నిన్ను పట్టించుకోకుండా వదిలేసినందుకు నన్ను క్షమించు..’’ అని మనలో ఉన్న పసిభావనలను లాలించాలి. అయితే ఆ భావనలు అంత సులభంగా లొంగవు. అనేక రకాల ప్రశ్నలు వేస్తాయి. మన నిబద్ధతను ప్రశ్నిస్తాయి. వాటిని ఎదుర్కొని పరిష్కారాన్ని అందించగలిగితే- శాంతి ఏర్పడుతుంది. చిన్నతనంలో మనతో పెరిగిన అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అనుబంధాలు పరిపుష్టమైన తర్వాత పరిపూర్ణ మానసిక ప్రశాంతత సాధ్యమవుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక అన్వేషణ సులభతరమవుతుంది.