భవిష్యత్తులో మెదడు హ్యాకింగ్‌ ?

విజ్ఞానం మాటున పొంచి ఉన్న ముప్పు

జెనీవా, 01-04-2017: ఎక్కడో.. ఎవరో.. మీ మెదడులో కదలాడే ఆలోచనలను సునాయాసం గా చదివేస్తారు. మెదడులోకి చొచ్చుకువచ్చి ఆలోచనలను దొంగిలిస్తారు. అవును హ్యాకింగే.. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లను హ్యాక్‌ చేసి సమాచారం దొంగిలించినట్లు భవిష్యత్తులో మెదడును హ్యాకింగ్‌ చేసి ఆలోచనలను దొంగిలిస్తారు. న్యూరోటెక్నాలజీలో వస్తున్న మార్పులు ఈ ప్రమాదానికి దారితీసే ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మానవ హక్కుల చట్టాలను ఈ దిశగా మరింత పటిష్టం చేయకపోతే హ్యాకింగ్‌ ప్రమాదం ఉందన్నారు. స్వీయ గౌరవానికి, వ్యక్తి స్వేచ్ఛకు అతి ముఖ్యమైన ‘ఫ్రీడం ఆఫ్‌ మైండ్‌’ కు న్యూరోటెక్నాలజీ రూపంలో ప్రమాదం పొంచి ఉందన్నారు. సాంకేతికత పురోభివృద్ధితో ప్రయోజనాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. దుర్వినియోగానికి ఆస్కారం కూడా పెరుగుతుందని హెచ్చరించారు.