ముందుగా స్పందించేది మెదడే!

ఆంధ్రజ్యోతి, 22-04-2017:ఒక వేదిక మీద ఓ సంగీతకారుడు గుక్క తిప్పుకోకుండా గమకాలు అనేస్తున్నాడనుకోండి! వేదిక చుట్టూ గమనించి చూడండి.. ఆ గమకాల గమనానికి తగినట్లు తలూపుతూ కొందరు, చేతులు ఊపుతూ ఎందరో కనిపిస్తారు. అదే వేదికపై ఏ సాల్సా నృత్యమో ప్రదర్శిస్తున్నారనుకోండి! సమ్మోహనపరిచే ఆ నాట్యానికి తగ్గట్టుగా.. కాళ్లు కదిలించే వారు కొందరుంటారు. ఒళ్లంతా ఊగిపోయేవారూ కనిపిస్తారు.

 
ఇలా మనసుకు ఆహ్లాదపరిచే సంగీతానికి తలూపడం, నృత్యానికి ఒళ్లంతా ఊపడం.. మానవ మస్తిష్కంపై అవి చూపే ప్రభావం వల్లేనని పరిశోధకులు చెబుతున్నారు. మనసు తాదాత్మ్యం చెంది పాటల్లో, ఆటల్లో లీనమైపోయారనడానికి ముందు శరీర అంతర్గతంగా ఎన్నో చర్యలు జరుగుతాయట. ఆ చర్యలకు ప్రతిచర్యగా.. మనసు స్పందించి.. శరీరం కదులుతుందని పరిశోధకులు సెలవిచ్చారు. ఏదైనా డ్యాన్స్‌ చూసినపుడు.. ముందుగా మెదడులోని కణాల్లో కదలిక ఏర్పడుతుంది. ఆ స్పందనలు కండరాలకు చేరుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తన ఆనందాన్ని బయటకు వ్యక్తం చేస్తాడట. ఇదీ సంగతి!