బీట్‌రూట్‌ రసంతో మెదడుకు యవ్వనం

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 20: వ్యాయామానికి గంట ముందు బీట్‌రూట్‌ రసం తాగితే మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వృద్ధాప్యం ముంగిట ఉన్నవారు రోజువారీ వ్యాయామానికి బీట్‌రూట్‌ రసాన్ని చేర్చడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ మెదడుకు యవ్వనాన్ని తిరిగి తీసుకొస్తుందని చెప్పారు. సాధారణంగా కండరాల ద్వారా మెదడుకు చేరే సమాచారాన్ని సోమటోమోటర్‌ కార్టెక్స్‌ విశ్లేషిస్తుంది. అయితే, వయసు పైబడే కొద్దీ దీని సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. వ్యాయామంతో ఈ కార్టెక్స్‌కు బలం చేకూరుతుందట. దీనికి బీట్‌రూట్‌ రసం కూడా తోడైతే మెదడు మరింత చురుగ్గా తయారవుతుందని వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.