సైలెంట్ కిల్లర్

నేడు వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే

హైదరాబాద్‌ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి):ఉదయం లేచింది మొదలు  పడుకునేంత వరకు జీవితం ఉరుకులు పరుగులే.. క్షణం తీరిక లేని జీవితంలో నగర జీవి టెన్షన్‌ టెన్షన్‌గా గడుపుతున్నాడు. పని వత్తిడి పెరిగిపోయింది.  నిద్ర సమయాలు మారిపోయాయి. ట్రాఫిక్‌ రణగణధ్వనుల మధ్యనే సగంజీవితం గడిచిపోతోంది. మొత్తం మీద మానవ జీవన విధాన రూపురేఖలే మారిపోయాయి. దీంతో నగర జీవి హైపర్‌టెన్షన్‌ సుడిగుండంలో చిక్కుకుపోతున్నాడు.
 

మనిషి తనకు ఉన్న ఒత్తిడుల కారణంగా  తెలియకుండానే హైపర్‌ టెన్షన్‌ బారిన పడుతున్నా డని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్యుడి  దగ్గరకు వెళ్లేంత వరకు ఈ సమస్యను గుర్తించడం లేదన్నారు.  వైద్యులు తమ దగ్గరికి వచ్చే వారిలో  30 శాతం మంది హైపర్‌టెన్షన్‌, అదే విధంగా మరో 20 శాతం మంది మధుమేహం ఉన్న బీపీ బాధితులు ఉన్నారని తెలిపారు. 40 నుంచి 50 శాతం హార్ట్‌ ఫెయిల్యూర్‌ బాధితులున్నారని పేర్కొన్నారు. రక్తనాలాల్లో బ్లాక్స్‌ ఎక్కువగా ఉండటమే హైపర్‌టెన్షన్‌కు ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు తెలిపారు. 20 శాతం పక్షవాతం, 15 శాతం మధుమేహం, 10శాతం కిడ్నీ సమస్యలు హైబీపీ వల్లనే వస్తున్నాయని వివరించారు. హైపర్‌టెన్షన్‌ను అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా మే 17న వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డేగా నిర్వహిస్తోంది. 

ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే

గతంలో పట్టణ ప్రాంతాల్లో హైపర్‌టెన్షన్‌ బాధితులను తెలుసుకోవడానికి మల్టీపర్పస్‌ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో గ్రేటర్‌లో హైపర్‌ టెన్షన్‌ బాధితులు పెరుగుతున్నారని తెలిసింది. ఇందులో చాలా మందికి తమకు హైపర్‌టెన్షన్‌ ఉన్నట్లే తెలియదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో 8  శాతం  మంది బాధపడుతున్నారని, 30 నుంచి 40ఏళ్ల వారిలో 12  శాతం, 40 నుంచి 50 ఏళ్ల వారిలో 15 శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 25 శాతం మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. హైపర్‌టెన్షన్‌ను ఎదుర్కొంటున్న వారిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు వివరించారు.

 టార్గెట్‌లు, ప్రాజెక్ట్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ వల్లే వీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. వీరి తర్వాత కాల్‌సెంటర్‌ ఉద్యోగులు,  వైద్యులు, టీచర్లు, అధ్యాపకులు ఉన్నారన్నారు. శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోక పోవడం, మద్యం ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రధాన కారణాలని  వైద్యులు తెలిపారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వివరిస్తున్నారు. నగర జీవనంలో ట్రాఫిక్‌ సమస్య కూడా టెన్షన్‌కు దారి తీస్తుందని వైద్యులు తెలిపారు. సిటీలో దాదాపు 15 శాతం ట్రాఫిక్‌ టెన్షన్‌తో జనం హైపర్‌టెన్షన్‌కు గురవుతున్నారని వారు వివరించారు. మార్కెట్‌ ఫీల్డ్‌లో పనిచేసేవారిలో హైపర్‌ టెన్షన్‌ బాధితులు ఉన్నారన్నారు. 

50 శాతం తెలియని కారణాలు

కొందరిలో ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్‌ బారిన పడుతున్నారని తెలిపారు.  50 శాతం మందికి కారణాలు తెలియడం లేదన్నారు. కొందరిలో వంశపారం పర్యంగా హైపర్‌టెన్షన్‌ వచ్చే అవకాశముందన్నారు. దీంతో ఏదో జబ్బు బారిన పడిన సమయంలో పరీక్షలు చేసినప్పుడు బీపీ ఉందని నిర్దారణ అవుతోందన్నారు.  హైపర్‌టెన్షన్‌ ఉందని తెలిసే సరికి చాలా మంది గుండె పోటు, బ్రెయిన్‌సో్ట్రక్‌ వంటి బారిన పడుతున్నారని చెప్పారు. అప్పుడప్పుడు బీపీ చెక్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
13 ఏళ్ల నుంచే ...
పాఠశాలల స్థాయి నుంచే హైపర్‌టెన్షన్‌కు పునాది పడుతుందని వైద్యులు వివరించారు. 13 నుంచి 15 ఏళ్ల మధ్యలోనే హైపర్‌టెన్షన్‌ లక్షణాలు ఉంటున్నాయని, అవి 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత బయట పడుతున్నాయని వైద్యులు చెప్పారు. ఆటపాటలు లేకపోవడం, టీవీలు, చదువు మీదే ధ్యాసం ఉండటం కూడా చిన్న వయస్సులో ఈ సమస్య రావడానికి కారణాలన్నారు. 
 
 
ఇలా ఉంటే..
ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండే విధంగా జాగ్రత్త వహించాలి.
అరటి, బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 
ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి.
 బయటి ఆహారం తీసుకోకూడదు.
టెన్షన్‌ను తగ్గించుకునేందుకు నచ్చిన వారితో మాట్లాడడం, మంచి సినిమాలు చూడడం, పాటలు వినడం చేయాలి.
ప్రతి రోజూ తప్పని సరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి.
సమయానికి ఆహారం తీసు కుంటూ తగినంత నిద్రపోవాలి. 
కొవ్వు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. 
తరచూ బీపీ చెక్‌ చేయించుకోవాలి. 
మధుమేహం, గుండె, కిడ్నీ  పరీక్షలు చేయించుకోవాలి. 
మద్యం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. 
ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, కా రం, ఉప్పు వాటికి దూరంగా ఉండాలి. 
జీవితాంతం మందులు వేసుకోవాలి, అవసరాన్ని బట్టి తగ్గించుకోవాలి. 
 
 
రక్తపోటును తెలుసుకోవాలి
ఇది ఎటాక్‌ చేసేంత వరకు తెలియని భయంకరమైన సైలెంట్‌ కిల్లర్‌. ఎటువంటి కారణం లేకుండా... ఏ లక్షణమంటూ తెలియకుండానే ఒకేసారి దాడి చేస్తుంది. సగం కంటే ఎక్కువ మందికి లక్షణాలు తెలియకుండానే హైపర్‌టెన్షన్‌ బారిన పడుతున్నారు. రక్తపోటు అతి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు  విపరీత మైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసకబారడం. తీరని అలసట, మగతగా అనిపించడం, చెవుల్లో రింగుమని శబ్దాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు గుండెదడ, తికమకపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావొచ్చు. కళ్లు దెబ్బతినే అవకాశముంది.  ఎక్కువ కాలం బీపీ ఉంటే గుండెపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. గుండె, మెదడు రక్తం సరఫరా చేసే నాళ్లాలో అడ్డంకులు ఏర్పడతాయి. దీని వల్ల గుండె, బ్రెయిన్‌ సో్ట్రక్‌ వచ్చే ప్రమాదముంది. 20 ఏళ్లు దాటిన వారు, ఒత్తిడిలో పనిచేసేవారు  వీలైనప్పుడల్లా గుండె పరీక్ష, బీపీ చెక్‌ చేయించుకోవాలి. 
- డాక్టర్‌ జి.రాజశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్‌, యశోదా ఆస్పత్రి
 
 
హైపర్‌టెన్షన్‌తో గుండెకు చేటు

గ్రేటర్‌లో హార్ట్‌ ఫెయిల్యూర్‌, రక్తనాలాల్లో బ్లాక్స్‌ తో వచ్చే వారిలో హైపర్‌టెన్షన్‌ బాధితులు ఉంటు న్నారు. ఇటువంటి వారి లో హైబీపీనే ఉంటోంది. గుండె జబ్బులకు ప్రధాన కారణం రక్తనాళ్లాల్లో బ్లాక్స్‌ ఏర్పడడం. ఇది ఎక్కువ హైపర్‌టెన్షన్‌ వల్లనే జరుగుతుంది. అలాగే హైబీపీ వల్ల గుండె మందం పెరుగుతుంది. ఇటువంటి సమయంలో గుండె పనితీరులో తేడాలు వస్తాయి.  ఈ హైపర్‌టెన్షన్‌ వల్ల కొందరికి బ్రెయిన్‌ స్ర్టోక్‌ వచ్చే ప్రమాదముంది, దీని వల్ల కాలు, చేయి, మాట పడి పోవచ్చు. ఇటీవల  బ్రెయిన్‌స్ట్రోక్, గుండె సంబంధిత కేసులు పెరుగుతున్నాయి. చిన్న వయసులో హైపర్‌టెన్షన్‌ ఉన్న వారికి కిడ్నీ రక్తనాళంలో అడ్డంకి ఏర్పడుతుంది. దీని వల్ల కిడ్నీ దెబ్బతిని పనిచేయ కుండా పోయే ప్రమాదముంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవాలి.  

- డాక్టర్‌ రమేష్‌ గూడపాటి, సీనియర్‌ కార్డియాలజిస్టు,
 స్టార్‌ ఆస్పత్రి