బీపీ చూపించుకున్నారా..!!

న్యూఢిల్లీ, మే 1: బీపీ చివరిసారిగా ఎప్పుడు చూపించుకున్నారు? అప్పుడు ఎంత ఉంది? గుర్తులేదా!.. అయితే మీ కోసమే ఈ వార్త. ఎందుకంటే గత ఏడాది కాలంగా రక్తపోటును పరిశీలించని వారికి ఇప్పుడు పరిశీలించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు కలిసి ముందుకొచ్చాయి. మే నెలను మే మెజర్‌మెంట్‌ మంత (ఎంఎంఎం)గా ప్రకటించారు. దేశంలో 25 లక్షల మందికి, ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి బీపీని చెక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలోని ఐసీఎంఆర్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా 100కిపైగా సంస్థలు బీపీ పరిఽశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో 500కుపైగా నగరాల్లో బీపీ పరిశీలన చేస్తారు. మీరు ఏ ఆస్పత్రికి వెళ్లినా అక్కడ ఉచితంగా.. లేదా నామమాత్రపు రుసుము చెల్లించి బీపీ చెక్‌ చేయించుకోవచ్చు. బీపి సరిగ్గా చూపించుకోకపోవడం.. అధిక రక్తపోటున్నా.. దాన్ని పట్టించుకోకపోవడంతో దేశంలో ఏటా 2 లక్షల మంది హృద్రోగాలు, స్ర్టోక్‌.. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. దీంతో ప్రజల్లో బీపీపై అవగాహన పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆరోగ్య సంస్థలను బీపీ పరిశీలన నెల కార్యక్రమాన్ని చేపట్టాయి. 120/80 అంతకన్నా కాస్త తక్కువగా ఉంటే.. సాధారణంగా.. 140/90 వరకు హైపర్‌టెన్షన్‌కు ముందు దశగా భావిస్తారు. 140/90 కన్నా అధిక రక్తపోటు ఉంటే.. తప్పనిసరిగా దానిపై నిరంతరం ఓ కన్నేయాలి. తరచూ పరిశీలన చేయించుకోవడం మంచిది. రక్తపోటు పెరగడానికి కారణాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి.