ఫుట్‌బాల్‌ ఫిట్‌నెస్‌తో బిపి కట్టు

ఆంధ్రజ్యోతి29-01-2017: ఆడవాళ్లల్లో రక్తపోటు ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడంలో ఫుట్‌బాల్‌ క్రీడ మంచి మందులా పనిచేస్తుందట. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆడవాళ్లు రోజూ ఒక గంట అలా వారానికి రెండు మూడు సార్లు ఫుట్‌బాల్‌ క్రీడ శిక్షణ పొందితే ఎంతో మంచిదట. ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఫుట్‌బాల్‌ క్రీడ ఆడడం వల్ల వీరిలో రక్తపోటు తగ్గడమే కాదు శరీరం కూడా మంచి ఫిట్‌నెస్‌తో ఉంటుందట. శరీరంలోని కొవ్వును సరిగా బ్యాలెన్స్‌ చేసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. యూనివర్సిటీ ఆఫ్‌ సౌదరన్‌ డెన్మార్క్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ క్రూస్ట్రప్‌ ఆడవారికి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాక్టికల్‌గా ఈ అంశాలను నిరూపించారు. ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందని అధికరక్తపోటుతో బాధపడుతున్న ఆడవారికి ‘ఫుట్‌బాల్‌ ఫిట్‌నెస్‌’ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని కొవ్వును ఇది కరిగిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అధిక రక్తపోటున్న ఆడవారికి ‘ఫుట్‌బాల్‌ ఫిట్‌నెస్‌’ ఒక మందులాంటిది. అధికరక్తపోటుతో బాధపడుతున్న 35-50 సంవత్సరాల వయసున్న ఆడవారిపై శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. వీరిలో 19 మందికి ‘ఫుట్‌బాల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌’ని వారానికి రెండు మూడు పర్యాయాలు అందించారు. మొత్తం 128 సెషన్లు ఇచ్చారు. ఫుట్‌బాల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో హై-పల్స్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్‌ ఉంటుంది. స్ట్రెం‌గ్త్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. అందుకే ఫుట్‌బాల్‌ క్రీడ ఆరోగ్యపరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫుట్‌బాల్‌ ట్రైనింగ్‌లో ఆడవాళ్లు పాల్గొనడం వల్ల రక్తపోటు పరంగా ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. శరీరానికి సంబంధించిన అధిక కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్‌, ఎముకల దృఢత్వం, ఇంటర్‌వెల్‌ ఫిట్‌నెస్‌ల మీద కూడా ఇది మంచి ఫలితాలను చూపుతుంది.