ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌ అంటే?

30-07-2017:  మా నాన్నగారికి బాగా తలనొప్పి రావడంతో డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాం. ఆయనకు హైపర్‌ టెన్షన్‌ ఉందని చెప్పారు. ఆ డాక్టర్‌ పక్కనున్న మరో డాక్టరేమో ‘‘ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌ ’’అని చెప్పారు. అంటే ఏమిటని నేనూ అడగలేదు. డాక్టర్‌ గారూ చెప్పలేదు. కానీ, ఆ సందేహం మాత్రం నన్ను తొలుస్తూనే ఉంది. ఇంతకీ ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌ అంటే ఏమిటి? అది మామూలు బి.పి లాంటిది కాదా? ఈ వివరాలు చెప్పండి?

- డి. వసంత్‌ కుమార్‌, ఖమ్మం
 
సాధారణంగా గుండె నుంచి రక్తాన్ని కొనిపోయే బృహద్ధమని ఇరుకుగా ఉండడం, కిడ్నీవ్యాధి, అడ్రినల్‌ గ్రంథిలో గడ్డలు, గుండె లేదా ఊపితిత్తుల జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు అధిక రక్తపోటుకు కారణమవుతూ ఉంటాయి. అయితే ఫలానా కారణమంటూ ఏమీ కనిపించకుండానే కొందరిలో నిరంతరం రక్తపోటు అధిక స్థాయిలో ఉంటుంది. దీన్నే ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌ అంటారు. ఈ రక్తపోటు రావడానికి జీవన శైలి ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి స్థూలంగా కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. వాటిల్లో శరీర శ్రమ లేకపోవడం, పొగతాగడం, అధిక బరువు, మద్యపానం, వయస్సు పైబడటం, మానసిక ఒత్తిళ్లు, తీసుకునే ఆహార పదార్థాలు, కుటుంబ చరిత్ర, ప్రధాన కారణంగా ఉంటాయి. ఈ తరహా జీవన శైలిని మార్చుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. కొందరిలో మధుమేహం ఒక పరోక్ష కారణంగా ఉంటుంది. మధుమేహంతో వచ్చే గుండె సమస్యలు, కొలెస్ట్రాల్‌ నిలువలు పెరిగిపోవడం వంటివి వీరి రక్తపోటును పెంచుతాయి. అందుకే మఽధుమేహులు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తపోటు 120/ 80 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రతించి అవసరమై వైద్య చికిత్సలు తీసుకోవాలి.
-డాక్టర్‌ శరత్‌కుమార్‌, జనరల్‌ ఫిజీషియన్‌