చప్పటి తిండే తినాలా..?

నాకు గత నాలుగేళ్లుగా హై- బిపి సమస్య ఉంది. రోజూ వాకింగ్‌ చేస్తూనే ఉన్నా, అయినా రక్తపోటు మాత్రం తగ్గడం లేదు. ఏ డాక్టర్‌ వద్దకు వెళ్లినా పూర్తిగా మాత్రల మీదే ఆధారపడితే సరిపోదు, మీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించేయండి. బిపి అదుపులోకి వచ్చేదాకా అసలు మొత్తంగానే మానేస్తే ఇంకా బెటర్‌ అంటున్నారు. నాకేమో ఉప్పు ఏ కాస్త తగ్గినా ముద్ద దిగదు. ప్రతి భోజనంలోనూ అదనంగా ఉప్పు వేసుకుంటాను. ఉప్పు లేని ఆ చప్పటి తిండి తినడం నా వల్ల కాదు. అయినా, ఉప్పు తగ్గించకుండా బిపిని అదుపు చేసే మార్గాలేమీ లేవా?
 
- కె. రాజారెడ్డి, జగిత్యాల
 
మొదట్నించీ మీరు ఎక్కువ మోతాదులో ఉప్పు తినడానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి అలా అనిపిస్తోంది గానీ, ఓ నెల రోజుల పాటు మనసు నిగ్రహించుకుని ఉప్పు లేకుండా తినండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు తింటున్న ఈ మోతాదును అప్పుడు భరించలేరు. నిజానికి ప్రపంచంలో కెల్లా చప్పటి భోజనమే, ఉత్తమ భోజనం. ఉప్పులో నేరుగా బిపిని పెంచే గుణం ఉంది. హై బిపి ఉంటేనే అని కాదు. ఆ సమస్య లేని వారు కూడా ముందు జాగ్రత్తగా ఉప్పును మానేయడం లేదా బాగా తగ్గించేయడం క్షేమకరం. ఉప్పులో ప్రధానంగా సోడియం ఉంటుంది. ఇది రక్తపు సాంద్రతను పెంచుతుంది. ఫలితంగా బిపి పెరుగుతుంది.
 
వాస్తవానికి కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాలే గానీ, ఆకు కూరల్లో, కాయగూరల్లో సహజంగా ఉండే సోడియమే శరీరానికి సరిపోతుంది. అది చాలదన్నట్లు అదనంగా ఉప్పు వేసుకుంటే అధికరక్తపోటు సమస్య మీ జీవితకాలపు నేస్తమవుతుంది. మీరు రోజూ వాకింగ్‌ చేస్తున్నామన్నారు.
 
అయితే ఆ వాకింగ్‌ 45 నిమిషాల దాకా ఉండాలి. ఏదో పదీ, పదిహేను నిమిషాలు చేసి సంబరపడితే ప్రయోజనమేమీ ఉండదు. ఒకవేళ అలా 45 నిమిషాలూ చేసినా, ఉప్పు వాడకాన్ని మాత్రం తగ్గించాల్సిందే. మరో విషయం ఏమిటంటే, ఉప్పు వాడకంతో బిపి ఎలాగూ పెరుగుతుంది. దీనికి తోడు ఉప్పు పరోక్షంగా మధుమేహానికి కూడా దారి తీస్తుంది. ఉప్పులోని శరీర రసాయన ధర్మాన్ని మార్చే గుణమే ఇందుకు కారణం. ప్రస్తుతానికి మీకు మధుమేహం లేకపోయినా ఉప్పు వాడకాన్ని ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒక రోజు మధుమేహం బారినపడటం ఖాయం. అందుకే ఇప్పటికైనా ఉప్పు తగ్గించడానికి సిద్ధం కండి. లేదంటే ఇప్పుడు మీన్న హై బిపి తో మధుమేహం చేయి కలుపుతుంది. ఆ తర్వాత ఇక మీ ఇష్టం.
 
- డాక్టర్‌ జి. సత్యనారాయణ, జనరల్‌ ఫిజిషియన్‌