ఉప్పు తగ్గించినా.. బీపీ తగ్గదు!

బోస్టన్‌, ఏప్రిల్‌ 26: ఉప్పు వాడకం తగ్గిస్తే రక్తపోటు కూడా తగ్గుతుందని చాలాకాలంగా ఉన్న నమ్మకం..అయితే ఇది నిజం కాదని తాజా పరిశోధన తేల్చింది. ఈమేరకు సుదీర్ఘకాలం పాటు జరిగిన పరిశోధనలో 2,632 మంది వలంటీర్లను పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు బోస్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనలో భాగంగా.. 30 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వలంటీర్లను 16 సంవత్సరాలపాటు నిశితంగా పరిశీలించామని వారు చెప్పారు. పరిశోధన ప్రారంభంలో వలంటీర్లు సాధారణ రక్తపోటుతో ఉన్నారని వివరించారు. వీరిలో కొంతమందికి రోజుకు 2500 మిల్లీగ్రాముల ఉప్పును, మరికొంతమందికి ఇంకా ఎక్కువ పరిమాణంలో ఉప్పును ఆహార పదార్థాలతో అందజేశామన్నారు.రోజూ పెద్దమొత్తంలో ఉప్పును స్వీకరించిన వారితో పోలిస్తే 2500 మిల్లీగ్రాములు తీసుకున్న వారిలోనే రక్తపోటు ఎక్కువగా ఉందని చెప్పారు. 3717 మిల్లీగ్రాముల ఉప్పును తీసుకున్నవారి బీపీ తక్కువగా ఉందని తెలిపారు.