బీపీకి చెర్రీతో చెక్‌

ఆంధ్రజ్యోతి,20-04-2017: ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని పనులతో అందరిలోనూ ఒత్తిడి సాధారణం అయిపోయింది. ఒత్తిడికి చిత్తయిపోయి బీపీ, హైపర్‌టెన్షన్‌ బారినపడుతున్న వారెందరో ఉంటున్నారు. ఈ ఒత్తిడికి చెక్‌ పెట్టాలంటే రెగ్యులర్‌గా చెర్రీపళ్ల జ్యూస్‌ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బీపీ, హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో చెర్రీ జ్యూస్‌ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. స్టడీలో భాగంగా బీపీతో బాధపడుతున్న వారిని పరిశీలించారు. వీరికి రోజూ 60 మిల్లీలీటర్ల చెర్రీ జ్యూస్‌ అందించారు. జ్యూస్‌ తీసుకునే ముందు, తీసుకున్న కాసేపటికి పరిశీలించగా బీపీలో వ్యత్యాసం స్పష్టంగా నమోదైందని పరిశోధకులు పేర్కొన్నారు. జ్యూస్‌ తీసుకున్న మూడు గంటల తర్వాత కూడా బీపీ కంట్రోల్‌లో ఉన్నట్టుగా వారు గుర్తించారు. అధిక రక్తపోటు దీర్ఘకాలంలో గుండెకు సంబంధించిన రుగ్మతలకు కారణం అవుతోంది. ఈ మేరకు రక్తపోటు బాధితులు చెర్రీ జ్యూస్‌ను తరచూ తీసుకోవడం మంచిదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.