అంజీరతో అదుపు...

28-07-2017:  అంజీర పండును కొన్ని ప్రాంతాల్లో సీమ మేడిపండుగా కూడా పిలుస్తారు. ఈ పండులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు అవసరం. అంజీర పండులో ఇవి సమృద్ధిగా ఉంటాయి. అయితే, అధిక రక్తపోటు పీడితులకు ఈ పండ్లు ఇచ్చినప్పుడు గరిష్ట రక్తపోటు (సిస్టాలిక్‌) 13 పాయింట్లు, కనిష్ట రక్తపోటు (డయాస్టాలిక్‌) 5 పాయింట్లకు తగ్గినట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎప్పుడూ ఆకలితో ఉంటూ, కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆబగా తినేస్తూ కొందరు ఊబకాయాన్ని తెచ్చుకుంటారు. అలాంటి వారు అంజీర పండ్లను తింటే, వాటిలోని పీచుపదార్థం, క్యాల్షియం, ఐరన్‌ ఆకలిని తగ్గించడం ద్వారా క్రమంగా బరువును తగ్గిస్తాయి. అంజీర పండ్లలోని క్యారటోన్లు, ల్యూటిన్‌, టాన్నిస్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, కరిగిపోయే పీచు పదార్థం ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలో ఎ, ఇ, కే విటమిన్లు తగినంత స్థాయిలో ఉంటాయి ఈ పండ్లలో కేలరీలు కూడా చాలా తక్కువే. అంటే దాదాపు 100 గ్రాముల పండ్లలో 74 కేలరీలే ఉంటాయి.
మాంస కృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వు తక్కువ గానూ, నీరు ఎక్కువగానూ ఉంటాయి. ఇది కూడా బరువు నియంత్రణలో ఉండడానికి తోడ్పడుతుంది.