వ్యాయామం వద్దు...టీవినే ముద్దు

10-10-2018: ఇదేదో స్లోగన్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్టే! సాధారణంగా యువత, పిల్లలు వ్యాయామం చేయమంటే కొద్దిగా బద్ధకిస్తారు. అదే మధ్యవయస్కులు, వృద్ధులు వ్యాయామం అంటే ఆసక్తిని కనపరుస్తారు అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ అభిప్రాయం తప్పంటున్నారు పరిశోధకులు. పెద్దలు వ్యాయామం కన్నా టీవీ చూడడం, స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం లండన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పెద్దలు వారంలో కేవలం 90 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే పదిహేడు గంటలు టీవి లేదా, స్మార్ట్‌ఫోన్లు చూడడానికి వినియోగిస్తారన్న విషయం వెల్లడైంది. ప్రతి ఏడుగురిలో ఒకరు శారీరక వ్యాయామానికి 30నిమిషాల కన్నా తక్కువ కేటాయిస్తున్నారట! వ్యాయామం తక్కువ కావడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం తదితర కారణాలు వారిని ఊబకాయం వైపు నెడుతున్నాయనీ, ఫలితంగా పలు ఆరోగ్య సమస్యలతో అకాల మృత్యువు బారిన పడుతున్నారని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు.