పిల్లల్లో డయాబెటీస్‌ ఎందుకొస్తుందంటే....

10-10-2018: టైపు 1 డయాబెటీస్‌ ఇప్పుడు పిల్లల్లో కనిపించడం సర్వసాధారణమైపోయింది. దీనికి కారణం వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు కొంత కారణం. ఇవే కాకుండా వారు గర్భంలో ఉండగానే ఈ రకం డయాబెటీస్‌ రావడానికి అంకురార్పణ జరిగిందంటున్నారు అధ్యయనకారులు.. తల్లి గ్లూటెన్‌ అధికంగా ఉండే పాస్తాలాంటి ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలనే ఈ సమస్య తలెత్తుతోందట! వీరికి పుట్టే పిల్లలు పదహారు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి టైపు 1 డయాబెటీస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. గర్భవతులు ఆహారపదార్థాల ద్వారా రోజుకు 20గ్రాములకు మించి గ్లూటెన్‌ను ఎక్కువగా తీసుకుంటే వీరి పిల్లలు టైపు 1 డయాబెటీస్‌ బారిన పడే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. అదే రోజుకు ఏడు గ్రాములు మాత్రమే గ్లూటెన్‌ కలిగిన ఆహారపదార్థాలు తీసుకుంటే ఈ సమస్య అంత ఎక్కువగా ఉండదని అంటున్నారు. గర్భవతులు తాము తీసుకునే ఆహారం మీద అవగాహన కలిగి ఉండడం అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.