కెమికల్‌ లవ్‌!

ఆంధ్రజ్యోతి,14-2-2017:ఒక వ్యక్తి పట్ల ఆకర్షితులయినపుడు మెదడులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రకరకాల రసాయనాలు విడుదలవుతాయి. వాటి ప్రభావంతోనే అనుబంధం పెరుగుతుంది. ఆ విశేషాలు ఇవి... 

మెదడులో జరిగిన రసాయనాల ప్రేమాయణం ఎలా ఉంటుందో మోడల్‌ రూపంలో తయారు చేసి తెలిపింది అమెరికాలో రుట్జెర్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న బయోలాజికల్‌ ఆంత్రోపాలజిస్ట్‌ హెలెన్‌ ఫిషర్‌. 

 ప్రేమలో పడటంలో మూడు దశలుంటాయి. అవి కామం, ఆకర్షణ, అనుబంధం. ప్రతి దశలోనూ రకరకాల హార్మోన్ల ప్రమేయం ఉంటుంది. 

 భాగస్వామిని కలిసినపుడు శరీరం మొదటి స్పందన మనకు పిల్లలు కావాలి అని ఉంటుంది. 

ఎప్పుడైతే ఎవరికైనా ఆకర్షితులవుతారో తెలియకుండానే వారి జీన్స్‌ను ఇష్టపడతారు. 

 ఎక్కువ శాతం చూడటానికి తమ తల్లిదండ్రుల మాదిరిగా ఉన్న వారి పట్ల ఆకర్షితులవుతుంటారు. 

న్యూక్లియస్‌ అక్యుంబెన్స్‌ - డోపమైన్‌ విడుదలను నియంత్రిస్తుంది. 

లాటెరల్‌ ఆర్బిటో ఫ్రంటల్‌ కార్టెక్స్‌ - ప్రవర్తన నియంత్రణకు సంబంధించి కీలకమైనది. 

పిట్యూటరీ గ్రంథి - అనుబంధం పెరగటానికి అవసరమైన రసాయనాలు విడుదల కావడానికి సహాయపడుతుంది. 

వెంట్రల్‌ టెగ్‌మెంటల్‌ ఏరియా - డోపమైన్‌ను విడుదల చేస్తుంది. 

సెరెబెల్లం - అత్యాశ, కామం, అధికంగా తినడం వంటి ప్రవర్తనలను నియంత్రిస్తుంది.

 స్టేజ్‌ 1 : (కామం) మెదడు టెస్టోస్టిరాన్‌, ఈసో్ట్రజన్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది. కళ్లలోకి చూడటం, తాకడం వంటి లక్షణాలుంటాయి. 

 స్టేజ్‌ 2 : (ఆకర్షణ) మెదడు డోపమైన్‌, నొరెపైన్‌ఫ్రైన్‌, సెరటోనిన్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. డోపమైన్‌ సంతోషాన్ని అందిస్తుంది. నొరెపైన్‌ఫ్రైన్‌ గుండె వేగాన్ని పెంచుతుంది. సెరటోనిన్‌ ఆకలిని, నిద్రను దూరం చేస్తుంది. 

 స్టేజ్‌ 3 : (అనుబంధం) ఆక్సిటోసిన్‌, వాసోప్రెస్సిన్‌ అనే రెండు హార్మోన్లు విడుదలవుతాయి. ఆక్సిటోసిన్‌ భావప్రాప్తి పొందే సమయంలో విడుదలయి బంధాన్ని పెంచుతుంది. వాసోప్రెస్సిన్‌ నమ్మకం, నిబద్ధత, ఇతర ఎమోషన్లకు సంబంధించినది. 

 ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్‌, వాసోప్రెస్సిన్‌ హార్మోన్లు డోపమైన్‌, నొరెపైన్‌ఫ్రైన్‌ హార్మోన్లతో క్లాష్‌ అవుతాయి. దీంతో అనుబంధం పెరుగుతుంది. సులభంగా ఉద్రేకపడే ప్రేమ సన్నగిల్లుతుంది.