గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే?

10-05-2019: చర్మం పట్ల చూపించిన శ్రద్ధ గోళ్ల పట్ల చూపించం. వాటిని డబ్బాల మూతలు తీయడానికి, కూరగాయల తొడిమలు తెంపడానికి వాడతాం, నేల మీద ఒలికిన కొవ్వొత్తి బొట్లను తొలగించడానికీ ఉపయోగిస్తాం. ఈ పనుల వల్ల గోళ్లు పగులుతాయి, చిట్లుతాయి. పొరలుగా విడిపోతాయి. విరిగిపోతాయి. ఈ నష్టంతోపాటు గోళ్ల చిగుళ్లు ఇన్‌ఫెక్షన్‌కు లోనై కొత్త సమస్యలూ వచ్చి పడతాయి. కాబట్టి గోళ్ల ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వాటిని తరచుగా పరీక్షించుకుంటూ, శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, ‘మానిక్యూర్‌, పెడిక్యూర్‌’ లాంటి గోటి చికిత్సలు తరచుగా తీసుకుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్‌ పూసుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలి. గోళ్ల పట్ల తీసుకోవలసిన మరిన్ని జాగ్రత్తలు ఏవంటే....
చిగుళ్ల లోపలకి లేదా మరీ బయటకు కత్తిరించుకోకూడదు. చిగుళ్ల లోపలికి కత్తిరించుకుంటే సూక్ష్మక్రిములు తేలికగా లోపలికి ప్రవేశిస్తాయి. బయటకు కత్తిరించుకుంటే గోళ్ల అడుగున మట్టి చేరుకుంటుంది.
గోళ్లు విరిగితే వాటిని అలాగే వదిలేయకూడదు. విరిగిన గోళ్ల లోకి నీరు చేరి ఫంగస్‌ పెరుగుతుంది.
కత్తిరించేటప్పుడు, ఒక వైపు నుంచి మొదలుపెట్టి ముగించాలి. అంతేగానీ అడ్డదిడ్డంగా కత్తిరించుకోకూడదు.
గోళ్లు కత్తిరించుకున్న తర్వాత కచ్చితంగా ఫైలర్‌తో గోళ్ల అంచులు నునుపు చేయాలి. లేదంటే ఎగుడుదిగుడు గోటి అంచుల గుండా నీరు లోపలికి చేరి గోళ్లను బలహీనపరుస్తుంది.
స్నానం చేసిన తర్వాత గోర్లు మెత్తబడతాయి. కాబట్టి
కత్తిరించడానికి అదే అనువైన సమయం.
నెయిల్‌ కట్టర్‌ నాణ్యమైనదై ఉండాలి. దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
గోళ్ల రంగు తొలగించడానికి నాణ్యమైన అసిటోన్‌నే వాడాలి.
ప్రతి రాత్రీ గోళ్లకు నెయిల్‌ మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.
వారంలో కనీసం వరుసగా మూడు రోజుల పాటు అయినా రంగు వేసుకోకుండా గోళ్లకు గాలి, వెలుతురు సోకనివ్వాలి.
నాణ్యమైన గోళ్ల రంగులనే ఎంచుకోవాలి.
వేసుకున్న గోళ్ల రంగు రెండు రోజులకు మించి ఉంచుకోకూడదు.