అభ్యంగన స్నానంతో ఎంతో ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి, 06-06-2017:ప్రకృతి సహజంగా లభించే వాటిల్లో మొదటిది గాలి అయితే రెండవది నీరు. శరీరంలో నాలుగింట మూడు వంతులు నీరే ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఈ నీరు మిళితమై, పచనమై శరీర ధాతు ద్రవాలకు సహకరిస్తూ, శక్తిని ప్రసాదిస్తుంది. అయితే, శరీరంలోని మాలిన్యాలు, మలమూత్రాల ద్వారా , చెమట ద్వారా విసర్జింపచేయడంలోనూ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియల్ని ఉత్తేజితం చేయడంలోనూ నీటికి ఒక విశేష భూమిక ఉంది. శరీరం మీద కాసిన్ని చల్లనీళ్లు పడగానే, సప్తధాతువులూ, శరీరంలోని సమస్త కణజాలమూ చైతన్యవంతమవుతుంది. మూత్రపిండాలు, గుండె వంటి కీలక భాగాలకు రక్తప్రసరణ పెరిగి వాటి ప్రక్రియలన్నీ ఊపందుకుంటాయి.

నీళ్లు పలు రకాలు...
వర్షపు నీరు, నదీనీరు, చెరువు నీరు, సముద్రపు నీరు, కాలువ నీరు, ఊటనీరు లేదా చెలిమ నీరు ఇలా పలు రకాల నీరు మనకు అందుబాటులో ఉంటుంది. వీటిలో మంచినీటితోపాటు, ఉప్పు నీరు, గంధకపు నీరు, అభ్రకం నీరు, ఫ్లోరిన నీరు పలురకాల రసాయనాలు కలిసిన నీరు మనకు లభిస్తూ ఉంటుంది. వీటిల్లోనూ రంగు, రుచి, వాసన లేని పరిశుభ్రమైన నీరే శరీర చికిత్సలకు ఉత్తమంగా ఉంటుంది. కాలుష్య రహితంగా ఉండాలే గానీ, మనం రోజూవాడుతున్న నీళ్లు కూడా మంచివే.

జలచికిత్సా విధానాలు
ఇందులో భాగంగా, అభ్యంగన స్నానం, సర్వాంగ స్నానం, తొట్టిస్నానం, ప్రధానంగా ఉంటాయి. వీటిల్లో ఏ స్నానం చేసినా అరగంట దాకా భోజనం చేయకూడదు. భోజనం తర్వాతే అయితే భోజనం చేసిన 3 గంటల తర్వాతచేయాలి.

అభ్యంగన స్నానం
శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒకవేళ అవి పూర్తి స్థాయిలో బయటికి రాకపోతే తిరిగి రక్తంలో కలుస్తాయి. ఇలా రక్తం విషతుల్యమైతే శరీరం పలురకాల వ్యాధులను నిలయమవుతుంది. ఈ స్థితి రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా అభ్యంగన స్నానం చేయాలి.

కావలసిన వస్తువులు
నువ్వుల నూనె, వెన్న, కొబ్బరినూనె, వంట ఆముదము.. వీటిల్లో ఏదో ఒక నూనె తీసుకోవాలి. దీనికి తోడు సున్నిపిండి (శెనగపిండి లేదా మినప, పెసర, బియ్యం పిండి) ఒంటికి పట్టించి, సీకాయ, కుంకుమకాయ, నురుగుతో బాగా రుద్దుకుని స్నానం చేయుటను అభ్యంగనం అంటారు. ముందు ఏదో ఒక తైలాన్ని తీసుకుని తల నుంచి పాదాల దాకా బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల దాకా అలాగే ఉండాలి. సున్నిపిండిని నీటితో తడిపి, శరీర భాగాలన్నింటికీ పట్టించి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గట్టిగా మర్ధన చేయాలి. ఆ తర్వాత సీకాయ లేదా కుంకుడు రసం చూర్ణంతో రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

స్నానానికి ఉపయోగించే నీటి వేడిమి 105- 110 డిగ్రీలు దాటకుండా ఉంటే మంచిది. పై విధంగా వేడి నీటితో స్నానం పూర్తికాగానే, ఒక బకెట్‌ చన్నీటితో స్నానం చేయడం అవసరం. ఆ తర్వాత మెత్తటి టర్కీ టవల్‌తో తడి లేకుండా పరిశుభ్రంగా ఒళ్లంతా తుడుచుకోవాలి. ఆ తర్వాత పలుచుని దుస్తులు ధరించాలి. ఖద్దరు చేనేత దుస్తులు శ్రేష్టం.

    అభ్యంగన స్నానం చేసిన గంట దాకా భోజనం లేదా ఘన పదార్థాలేవీ తీసుకోకూడదు..
    కాకపోతే అరగంట తర్వాత మజ్జిగ , పండ్లరసం, పాల వంటివి తీసుకోవచ్చు.


- డాక్టర్‌ టి. కృష్ణమూర్తి , సూపర్‌వైజర్‌
రెడ్‌క్రాస్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచర్‌ క్యూర్‌, హైదరాబాద్‌