ముఖానికి ఆరెంజ్‌ మెరుపులు

09-06-2019: జిడ్డుచర్మం ముఖాన్ని డల్‌గా ఉంచుతుంది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లినపుడు ఎంత మేకప్‌ చేసుకున్నా కూడా ముఖం ఆకర్షణీయంగా కనపడదు. ముఖంపై ఉండే జిడ్డుపోవడానికి కమలాపండు (ఆరెంజ్‌) ఫేస్‌ ప్యాక్స్‌ బాగా పనిచేస్తాయి. వీటితో ముఖం కాంతులీనుతుంది. అలాంటి మూడు కమలాపండు ఫేస్‌ ప్యాక్స్‌ మీకోసం...
 
 
కమలాపండు-వేపాకు ప్యాక్‌
కమలాపండు గుజ్జు - మూడు టేబుల్‌స్పూన్లు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, వేపాకు పేస్టు - మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీ: ఒక బౌల్‌ తీసుకుని అందులో వేపాకుపేస్టు, పాలు వేసి బాగా కలపాలి. ఇందులో కమలాపండు గుజ్జు కూడా కలిపి చిక్కటి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు కూడా రాసుకోవచ్చు. ఈ ప్యాక్‌ ముఖానికి రాసుకున్న తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.
 
కమలాపండు-శనగపిండి ప్యాక్‌
శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, రోజ్‌ వాటర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు(కావాలనుకుంటే), కమలాపండురసం (గుజ్జు లేకుండా) - మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీ: కమలాపండు రసాన్ని ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులో శనగపిండి వేసి పేస్టులా అయ్యేదాకా కలపాలి. ఈ మిశ్రమంలో రోజ్‌ వాటర్‌ కూడా కావాలనుకుంటే కలపొచ్చు. ఎందుకంటే ఇది ముఖానికి తాజా అనుభూతిని ఇస్తుంది. ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ బాగా ఎండిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి. లేదా చల్లటి నీళ్లల్లో దూదిని ముంచి దాంతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవచ్చు కూడా. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
కమలాపండు-ఓట్‌మీల్‌ ఫేస్‌ ప్యాక్‌
ఓట్‌మీల్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, కమలాపండు రసం - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: ఒక బౌల్‌ తీసుకుని అందులో కమలాపండు రసం, ఓట్‌ మీల్‌ వేసి బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది పన్నెండు నిమిషాల వరకూ ఉంచుకుని ఆతర్వాత చల్లటినీళ్లతో బాగా కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ ప్యాకులు రాసుకుంటే మీ ముఖంలోని జిడ్డుతనంపోయి మిలమిలా మెరిసిపోతారు.