ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా...

30-09-2018: ఓట్స్‌ ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ఉపయోగపడతాయి. వీటితో ముఖానికి, చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. చర్మం మెరుపు కోసం, బాడీ స్క్రబ్‌గా ఓట్స్‌ ఎలా పనిచేస్తాయంటే...

చర్మం మెరవడానికి: ఒక కప్పు ఎండిన ఓట్స్‌ను మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బకెట్‌ వేడినీటిలో వేసి, నీళ్లలో కలగలిసేలా కలపాలి. ఆ నీటిలో కొద్దిగా రోజ్‌ వాటర్‌, లావెండర్‌ నూనె, లెమన్‌ గ్రాస్‌ కలిపి, 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చర్మం తళతళలాడుతుంది.
బాడీ స్క్రబ్‌: చర్మం మీది మృతకణాలను ఓట్స్‌ తొలగిస్తాయి. గిన్నెలో ఓట్స్‌ తీసుకొని, అందులో చక్కెర, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని, ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. పెరుగు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తే, చక్కెర, ఓట్స్‌ మృతకణాలను నిర్మూలిస్తాయి.
ఫేస్‌ మాస్క్‌: పాశ్చరైజ్‌డ్‌ చేయని యోగర్ట్‌ తీసుకొని, టేబుల్‌ స్పూన్‌ ఓట్స్‌, కొద్దిగా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేయాలి. రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌కు టేబుల్‌ స్పూను తేనె, పాలు, ఆలివ్‌ నూనె కలిపాలి. ముఖానికి ఈ మిశ్రమాన్ని వలయాకారంలో రాసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే కాంతులీనే ముఖం మీ సొంతం.