‘మాస్క్‌’లు మంచివే!

30-04-2019: ఫేస్‌మాస్కులనేవి కేవలం అందం కోసమే కాకుండా, అవి చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తాయంటున్నారు చర్మసంరక్షణ నిపుణులు. ఈతరం అమ్మాయిలు, మహిళలు ఫేస్‌మాస్క్‌ల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. పండ్లతో, పాలతో, ఆకుకూరలతో పాటు తేనె, ఓట్స్‌, చార్‌కోల్‌ వంటి వాటితో కూడా ఫేస్‌ప్యాక్స్‌ తయారుచేసుకుని వినియోగిస్తున్నారు. ‘ది బాడీ షాప్‌ ఇండియా’కు చెందిన శిక్షకురాలు శిఖా అగర్వాల్‌ ఫేస్‌మాస్క్‌ల ద్వారా చర్మానికి జరిగే మేలు గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.
 
రిలాక్సేషన్‌: ఫేస్‌మాస్కులు కేవలం పై పూతగానే పనిచేయవు. అవి థెరపీతో సమానం. సుగంధభరితమైన మింట్‌, రోజ్‌మేరీ వంటి ఆయిల్స్‌తో మాస్క్‌లు వేసుకుంటే అవి సహజంగానే చర్మానికుండే తాజాదనాన్ని ప్రేరేపిస్తాయి. ఇంటి దగ్గరే స్పా చికిత్సలు పొందిన అనుభూతి కలుగుతుంది. ముఖం రిఫ్రెష్‌ అవడమేగాక, రిలాక్స్‌ అవుతుంది.
 
డీప్‌ క్లీన్సింగ్‌: పై చర్మం, లోపలి చర్మం అనే రెండు పొరలుంటాయనే విషయం తెలిసిందే. 
ఒక మంచి ఫేషియల్‌ మాస్క్‌ చర్మం పైన ఉన్న జిడ్డును, కంటికి కనిపించని మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. అలాగే వాయు కాలుష్యంతో చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టి, వెంటనే కాంతివంతం చేస్తాయి. చర్మాన్ని లోపలి నుంచి కూడా శుభ్రపరచడంలో మాస్క్‌లు బాగా పనిచేస్తాయి.
 
లోపలి నుంచి శుభ్రత: ఓట్స్‌, తేనె, చార్‌కోల్‌లతో ఉండే మాస్క్‌లు చర్మంపై చాలా ప్రభావం చూపుతాయి. ఇవి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంతో బాగా తోడ్పడతాయి. సూక్ష్మరంధ్రాల్లోకి వెళ్లి చర్మం లోపలి మలినాలను కూడా బయటకు పంపుతాయి. ముఖ్యంగా మొటిమలు అధికంగా ఉన్నవారికి ఈ టైపు మాస్క్‌లు బాగా పనిచేస్తాయి.
 
చర్మం మెరుపు: తేనెతో చేసిన మాస్క్‌లు రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తాయి. చర్మం లోపల ఉండే రక్తకణాలు ఉత్తేజభరితం అయితే సహజంగానే చర్మం యవ్వనంతో మెరుస్తుంది. మాస్క్‌లు వేసి కాసేపటికి తీసేసిన తర్వాత ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇదే కారణం. అంతేకాదు మాస్క్‌ల వల్ల ఆ తర్వాత ఉపయోగించే సౌందర్య సాధనాలు కూడా బాగా పనిచేస్తాయి. మాయిశ్చరైజర్లు, సీరమ్స్‌, రాత్రివేళ ఉపయోగించే క్రీములు చర్మానికి హాని చేస్తాయని భావిస్తే, తప్పకుండా మాస్క్‌లతో వాటిని శుభ్రం చేయాల్సిందే.
 
ఫేస్‌ మాస్క్‌లు కేవలం పైపూతలాగే కాకుండా, చర్మగ్రంథులను కూడా ఉత్తేజం చేస్తాయి. అందుకే వాటిని వేసుకుని, తీసేసిన తర్వాత ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.