పెదాలు పగిలితే...

05-02-2018:నేచురల్‌ ఆయిల్స్‌, గ్రీన్‌ టీ, బీట్‌రూట్‌ జ్యూస్‌, గులాబీరేకులు... ఇంట్లో దొరికే ఇవన్నీ పెదాలను పగలనీయవు. మృదువుగా ఉంచుతాయి. అదెలాగంటే...

నేచురల్‌ ఆయిల్స్‌ అయిన కొబ్బరి నూనె, ద్రాక్షగింజల నూనె, నిమ్మ నూనె, ఆల్మండ్‌ ఆయిల్‌ వంటివి మాయిశ్చరైజర్లుగా బాగా పనిచేస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లలో కొబ్బరి నూనె ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్‌గా చేసుకుని, దానికి మిగతా నూనె ఏదైనా కలిపి పెదవులపై రాస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
 ఒక్కోసారి పగిలిన పెదాల నుంచి రక్తం కూడా కారుతుంది. అలాంటప్పుడు వెంటనే ఉపశమనం కలిగేందుకు తేనె, వాజిలైన్‌లను వాడాలి. ఆర్గానిక్‌ తేనెను మందంగా పూసి, దానిపైన వాజిలైన్‌ను పొరలా పూయాలి. పావుగంట తర్వాత పెదవులను తడి టవల్‌తో సున్నితంగా తుడవాలి.
 గులాబీరేకుల్లాంటి పెదవులు కావాలంటే గులాబీరేకులు కావాలి. పగిలిన పెదాలకు ఇవి ఉపశమనం ఇవ్వడమేగాక, వాటి రంగుని కూడా పెంచుతాయి. కొన్ని గులాబీరేకులను నీటిలో కడిగి, పాలల్లో కొన్ని గంటలు నానబెట్టాలి (పాల ఉత్పత్తులు పడకపోతే గ్లిజరిన్‌ వాడాలి). వాటిని పేస్టులాగా చేసి పొడి పెదాలపై రోజుకు మూడుసార్లు (రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా) రాస్తే పెదాల రంగు కూడా గులాబీ రంగులోకి మారిపోతుంది.
అలోవెరా కూడా పగిలిన పెదాలపై బాగా పనిచేస్తుంది. ఇది పెదాలపై పగుళ్లను పోగొట్టడమేగాక, పెదాలపై పొరను ధృడంగా చేస్తుంది. చలికాలంలోనే కాకుండా ఏడాది పొడవునా దీన్ని పెదాలపై వాడొచ్చు. రాత్రి నిద్రపోయే ముందు అలోవెరా ఆకును కత్తిరించి, దాని లోపలి జెల్‌ను నేరుగా పెదాలపై రాసుకోవచ్చు.
పాల మీగడ పెదాలకు చక్కని మాయిశ్చరైజర్‌. మీగడను పెదాలపై రాసి పది నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో మృదువుగా శుభ్రం చేస్తే పగుళ్లు మాయమవుతాయి.
బీట్‌రూట్‌ రసంలో పోషకాలు అనేకం. ఈ రసం చర్మంలోని తేమను కాపాడుతుంది. బయటకు వెళ్లేముందు తాజా బీట్‌రూట్‌ రసాన్ని నేరుగా పెదాలకు రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగితే పెదవులు తాజాగా కనిపిస్తాయి.
పెదాలపై దెబ్బతిన్న చర్మకణాలను బాగు చేయడంలో గ్రీన్‌ టీ బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు పెదవులను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. గోరువెచ్చని నీళ్లలో గ్రీన్‌ టీ బ్యాగును డిప్‌చేసి దాన్ని పెదాలపై పెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువసేపు ఉంచితే మంచిది.