మృదువైన చర్మానికి ‘గ్లిజరిన్‌’

26-09-2018: గ్లిజరిన్‌లో చర్మ సంరక్షణకు దోహదపడే గుణాలున్నాయి. గ్లిజరిన్‌ను నేరుగానూ వాడొచ్చు. చర్మ సౌందర్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే...
చర్మం మీద జిడ్డును, మలినాలు, మేక్‌పను గ్లిజరిన్‌ తొలగిస్తుంది. క్లిన్సింగ్‌ మిల్క్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకునే బదులు గ్లిజరిన్‌ను అందుకు వాడొచ్చు. ముందుగా ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసి, కాటన్‌ బాల్‌ మీద గ్లిజరిన్‌ వేసి, దాంతో ముఖం మీద రుద్దాలి. మూడు టేబుల్‌ స్పూన్ల పాలలో, టేబుల్‌ స్పూన్‌ గ్లిజరిన్‌ కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఉదయం నీళ్లతో కడిగితే ముఖం మెరిసిపోతుంది.
గ్లిజరిన్‌ మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. గ్లిజరిన్‌ రాసుకుంటే చర్మానికి తేమ లభించి, చర్మం మృదువుగా అవుతుంది. చర్మం నుంచి నీరు బయటకు వెళకుండా గ్లిజరిన్‌ అడ్డుకుని, చర్మం పొడిబారకుండా చూస్తుంది. చర్మ కణాల ఉత్పత్తిని పెంచుతుంది.