మృదువైన పెదాల కోసం..

16-12-2018: చలికాలంలో పెదవులు, చేతుల మీది చర్మం పొడిబారుతుంది. ఈ సీజన్‌లో శరీరాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పెదాలను పళ్లతో కొరకడం, వేళ్లతో రుద్దడం చేస్తారు కొందరు. లాలాజలం పెదాల మీది చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది. మృదువైన పెదాల కోసం ఏం చేయాలంటే...
 
తేనె: పెదాలకు తేనె చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తేనెను నేరుగా పెదాలమీద రాసుకోవచ్చు. లేదంటే తేనెకు కొద్దిగా గ్లిజరిన్‌ కలిపి నిద్రపోయే ముందు పెదాలకు రాసుకుంటే తేమగా, ఆరోగ్యంగా ఉంటాయి.
 
మిల్క్‌ క్రీమ్‌: తాజా పాలతో తీసిన క్రీమ్‌ను పెదాల మీద రాసుకొని 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిని కాటన్‌ బాల్‌తో మిల్క్‌ క్రీమ్‌ను తొలగించాలి. దీంతో పెదాలు మృదువుగా, రంగుమారకుండా ఉంటాయి.
 
లిప్‌బామ్‌: నిద్రపోయే ముందు వేడినీళ్లతో పెదాలను కడుక్కొని, పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. తర్వాత లిప్‌బామ్‌ రాసుకోవాలి. లిప్‌బామ్‌లో ఉండే బాదం నూనె, కొబ్బరి నూనె పెదాలను తేమగా ఉంచుతాయి.
 
లిప్‌స్టిక్‌: చల్లని గాలులకు పెదాల మీది చర్మం పగలకుండా లిప్‌స్టిక్‌ రక్షణనిస్తుంది. పెదాలను తేమగా ఉంచుతుంది.