మెరిసే ముఖం కోసం

05-06-2019: చర్మ సోయగాన్ని పెంచుకునేందుకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. వాటితో బోల్డెన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగవుతున్నాయి. అలాకాకుండా గ్రీన్‌ మాస్క్‌లను ఉపయోగిస్తే అందమూ పెరుగుతుంది. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. వీటితో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఈ ఫేస్‌ప్యాక్‌ల తయారీచూద్దాం.
 
జిడ్డు చర్మం: నాలుగు టేబుల్‌ స్పూన్ల సెనగపిండి, టీ స్పూను నిమ్మరసం, యోగర్ట్‌, చిటికెడు పసుపు తీసుకొని, ఒక గిన్నెలో చక్కగా, పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత వేడి నీళ్లతో కడిగేస్తే టాన్‌ , జిడ్డు చర్మం నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్లమచ్చలు, మెటిమలు తగ్గిపోతాయి. పొడిచర్మం జీవత్వంతో కనిపిస్తుంది. 
 
మృతకణాల తొలగింపు: బాగా మగ్గిన అరటిపండులో సగం తీసుకొని, మెత్తగా చేసుకోవాలి. దీనిలో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌, టీ స్పూను తేనె వేసి, కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్లతో కడిగేయాలి. దీంతో దెబ్బతిన్న చర్మ కణాలు మెరుగపడతాయి. చర్మానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయి.
బ్లీచ్‌ ప్యాక్‌: సమపాళ్లలో యోగర్ట్‌, టొమాటో రసం తీసుకొని చక్కగా మిక్స్‌ చేయాలి. ముఖం, మెడ భాగంలో ఈ ప్యాక్‌ను పట్టించి, 30 నిమిషాల తర్వాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితం కోసం రెండు రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలాచేస్తే ఎర్రటి మచ్చలు తగ్గిపోతాయి.
 
చర్మానికి సాంత్వన: తులసి ఆకులు, ఎండిన నారింజ తొక్కల పొడి మిశ్రమాన్ని చర్మం కందిపోయిన భాగంలో రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడినీళ్లతో కడిగేస్తే చర్మం మీద ఏర్పడిన ఎర్రటి మచ్చలు తగ్గుతాయి. చర్మానికి సాంత్వన లభిస్తుంది.