మెరిసే అందం కోసం..!

11-09-2017: సహజమైన పదార్థాలు వాడితే ఆరోగ్యం- అందం కలకాలం ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాంటి సింపుల్‌ అండ్‌ హెల్దీ టిప్స్‌ మీకోసం...
 
కళ్లు మెరవాలంటే....
నిద్ర సరిగ్గా లేక కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు ఏర్పడతాయి. అక్కడి చర్మం వదులుగా మారిపోయి ఇంకా వయసు మీరిన వాళ్లుగా కనపడటం సహజం. మార్కెట్‌లో దొరికే చామంతి పూల టీ బ్యాగ్స్‌ను మొదటగా కొంచెం సేపు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. కీర దోసకాయ ముక్కలతో, ఆ తర్వాత ఫ్రిజ్‌లోంచి తీసిన టీ బ్యాగులతో మరో పది నిమిషాలపాటు మసాజ్‌ చేసుకోవాలి.
 
అలసిన కళ్ల కోసం!
ఒక్కోసారి కళ్లు బాగా అలసిపోతాయి. కంప్యూటర్‌ స్ర్కీన్‌ చూస్తూ పనిచేయడం వల్ల తరచూ ఇలా అవుతూ ఉంటుంది. దీనికో చక్కటి చిట్కా ఉంది. చల్లటి నీళ్లల్లో 2-3 టీస్పూన్ల తేనె కలిపిన మిశ్రమంలో రెండు కళ్లు ముంచాలి. అయితే దీని వల్ల కళ్లు ఎర్రగా మారచ్చు కంగారు పడాల్సిన పనిలేదు. కొంచెం సేపటికి కళ్లు మామూలు స్థితికి వస్తాయి.
 
జిడ్డు మాయం....
కాంతివంతమైన చర్మం కోసం ఈ మధ్య కాలంలో యోగర్ట్‌ను విరివిరిగా ఉపయోగిస్తున్నారు. పెరుగులా ఉండే యోగర్ట్‌లో పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రుద్దుకుని కొంచెం సేపయ్యాక చల్లటి నీళ్లతో కడుక్కుంటే ముఖం మరింత ఫ్రెష్‌గా మారుతుంది. అలాగే బొప్పాయిని గుజ్జుగా చేసి అందులో చల్లటి పాలు, ఓట్స్‌లను కలిపి చర్మానికి పట్టించుకుంటే జిడ్డు పోతుంది.
 
కురుల సిరుల కోసం....
కొంత మందికి ఒక్కోసారి షాంపూ చేసే సమయం ఉండదు. జుత్తు మాత్రం జిడ్డుగా ఉంటుంది. ఇలాంటప్పుడే టాల్కం, ఉసిరి పొడిని జుత్తుకు పట్టిస్తే జిడ్డు పోతుంది.
 
ఉప్పుతో ఇలా...!
బ్యాక్‌ బ్లౌజ్‌లు, బ్యాక్‌లెస్‌ డ్రెస్‌లు( వీపు కాస్త కనపడేలా ఉండేవి) ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా పార్టీలకు, పెళ్లిళ్లకు ప్రిఫర్‌ చేస్తున్నారు. వీపు భాగం నునుపు కనబడాలంటే ఓ మంచి చిట్కా ఉంది. అరకప్పు ఆలివ్‌ నూనెలో తగినంత ఉప్పు కలిపిన మిశ్రమంలో అయిదు చుక్కల గంధం నూనె బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వీపు భాగానికి రాసుకుని కొంచెం సేపయ్యాక తడి టవల్‌తో తుడుచుకుంటే సరిపోతుంది.