అందానికి.. ఆకర్షణకు...

ఆకర్షణ ముఖంలో ఉంటుంది!
అది ముఖ చర్మం ఆరోగ్యంలో ఉంటుంది!!
అయితే, మొటిమలు, మచ్చలు, గుంటలు, పులిపిర్లు
చర్మ ఆకర్షణకు అడ్డంకులవుతాయి.
వీటికి శాశ్వత చికిత్సల పట్ల అవగాహన అవసరం.

24-06-2019: ముఖ చర్మం సున్నితమైనది. కాలుష్యం, వాతావరణ ప్రభావం, అంతర్గత హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఆహారపుటలవాట్లు...ఇలా చర్మం సమస్యల పాలబడడానికి కారణమయ్యే అంశాలు బోలెడన్ని! వీటి వల్ల మొటిమలు, మచ్చలు, గుంటలు, పులిపిర్లు లాంటి చర్మ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటిని ప్రారంభంలోనే కనిపెట్టి అప్రమత్తమవ్వాలి!

మొటిమల్లో రకాలున్నాయి!
యుక్తవయస్కులను ఎక్కువగా వేధించే మొటిమలు వేర్వేరు కారణాల వల్ల తలెత్తుతూ ఉంటాయి. జిడ్డు చర్మం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, జంక్‌ ఫుడ్‌, నూనెతో కూడిన పదార్థాలు ఎక్కువగా తినడం మొటిమలకు ప్రధాన కారణాలు. మొటిమల్లో బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, చీము ఏర్పడే మొటిమలు, గడ్డల్లా తయారయ్యే మొటిమలు... ఇలా చాలా రకాలు ఉన్నాయి. సాధారణంగా మొటిమలు తలెత్తిన రెండు వారాల్లోపు తగ్గిపోయి, మచ్చ ఏర్పడి, ఆ మచ్చ కూడా క్రమేపీ చర్మంలో కలిసిపోతుంది. అయితే కొందరిలో ఆ మచ్చ అలాగే ఉండిపోవడం, మరికొందరిలో మొటిమలు తగ్గినా ఆ ప్రదేశంలో గుంటలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటివాళ్లు తప్పనిసరిగా చర్మవైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. అంతేతప్ప ఎక్కడో చదివిన, ఎవరో చెప్పగా విన్న చిట్కాలు అనుసరించకూడదు. ఈ మధ్య కాలంలో అందరూ అనుసరిస్తున్న పద్ధతి మొటిమల మీద టూత్‌పే్‌స్ట పూసుకోవడం! కానీ ఈ చిట్కా వల్ల మొటిమలు తగ్గవు. మొదటి దశలో బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ ఉంటాయి. రెండో దశలో గుల్లల్లా మారతాయి. చీము పట్టిన మొటిమలు మూడవ దశకు చెందిన సమస్య. గ్రేడ్‌ 4లో మొటిమలు గడ్డల్లా ఉంటాయి. ఇలా మొటిమల దశను బట్టి యాంటీ బయాటిక్‌ మందులు, పైపూత క్రీమ్‌లు వాడవలసి ఉంటుంది. కొందరికి లేజర్‌ చికిత్సలూ అవసరమవుతాయి.
 
పలు రకాల పిగ్మెంటేషన్‌!
పిగ్మెంటేషన్‌ అంటే చర్మం మీద ఏర్పడే నలుపు. ఇది సూర్యరశ్మి సోకడం వల్ల వచ్చే ట్యానింగ్‌ కావచ్చు, మొటిమల వల్ల వచ్చే మచ్చలూ కావచ్చు. నుదురు, బుగ్గల మీద తలెత్తే మంగు కూడా పిగ్మెంటేషన్‌ కోవలోకే వస్తుంది. సూర్యరశ్మి సోకడం వల్ల తలెత్తే ‘ఫ్రెకెల్స్‌’ అనే చిన్న చిన్న మచ్చలు కూడా ఈ కోవకే చెందుతాయి. మొటిమల మచ్చలు, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే ‘ఫొటో ట్యానింగ్‌’, కళ్ల కింద నలుపు, పెదవుల చుట్టూ నలుపు, సౌందర్య ఉత్పత్తులు విచక్షణారహితంగా వాడడం వల్ల ఏర్పడే చర్మపు మచ్చలు... పిగ్మెంటేషన్‌ కోవలోకే వస్తాయి. ఈ మచ్చలన్నిటినీ మెరుగైన సన్‌స్ర్కీన్‌ వాడకంతో రాకుండా చూసుకోవచ్చు. అలా వాడకపోవడం వల్ల పిగ్మెంటేషన్‌కు లోనైతే వాటిని పోగొట్టే చికిత్సలు తీసుకోవాలి.
 
చికిత్స: పిగ్మెంటేషన్‌ చికిత్స కొంత క్లిష్టమైనది. ఈ రకం మచ్చలను శాశ్వతంగా తొలగించడం కష్టం. ఒకసారి తొలగించినా తిరిగి తలెత్తే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇవి రాకుండా చూసుకోవడం, వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడంతో పాటు, తర్వాత సన్‌స్ర్కీన్స్‌ వాడుతూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. సాధారణంగా పిగ్మెంటేషన్‌కు సంబంధించిన మచ్చలకు పైపూత మందులు, కొన్ని సబ్‌స్టిట్యూట్‌ మందులు వాడవలసి ఉంటుంది. అలాగే పిగ్మెంటేషన్‌ రకాన్ని బట్టి కెమికల్‌ పీల్స్‌, లేజర్‌ చికిత్సలూ అవసరమవుతాయి. పీల్స్‌ వల్ల చర్మపు పై పొర తొలిగి, వాడే పైపూత మందులు తేలికగా చర్మంలోకి ఇంకి, ఫలితం దక్కుతుంది. అయితే మంగులో మూడు రకాలుంటాయి. చర్మం పైపొరల్లో తలెత్తిన మంగు మచ్చలతో పోల్చుకుంటే, చర్మంలో మరీ లోతుగా ఉన్న వాటిని చికిత్సతో పూర్తిగా తొలగించడం కొంత కష్టం.
 
కళ్ల అడుగున, పెదవుల చుట్టూ నలుపు!
కళ్ల కింద నలుపు: కళ్ల చుట్టూ ఉండే చర్మం ఎంతో సున్నితమైనది. కొంతమందికి ‘అటోపిక్‌ డెర్మటైటిస్‌’ అనే ఎలర్జీ వల్ల కళ్లు దురదలు పెట్టి, వేళ్లతో రుద్దుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లగా మారుతుంది. కొందరికి వంశపారంపర్యంగానూ సంక్రమిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు క్రమం తప్పినా, చత్వారం ఉన్నా కళ్ల కింద నలుపు తలెత్తుతుంది. అయితే ఈ నలుపును శాశ్వతంగా పోగొట్టడమూ కొంత కష్టమే! చికిత్సతో వదిలించినా ఏ స్వల్ప ఒత్తిడికి లోనైనా తిరిగి తలెత్తుతుంది. అయితే ఈ సమస్యను ‘అండర్‌ ఐక్రీమ్స్‌’తో, సున్నితమైన మాయిశ్చరైజర్లతో అదుపు చేయవచ్చు. కెమికల్‌ పీల్స్‌, లేజర్‌ చికిత్సలతోనూ ఈ నలుపును పోగొట్టవచ్చు. పెదవుల చుట్టూ నలుపు: పెదవులు విరుచుకుంటూ ఉండడం, తరచుగా నాలుకతో తడుపుతూ ఉండడం, ఎలర్జీల కారణంగా ఈ నలుపు తలెత్తుతుంది. ఈ అలవాట్లను మానుకుని, అలర్జీలకు చికిత్స తీసుకో వడం ద్వారా కొంతవరకూ ఈ నలుపును అదుపు చేయవచ్చు. అలాగే పైపూతగా వాడే క్రీమ్స్‌, రెండు లేదా మూడు సెషన్లతో కూడిన లేజర్‌ చికిత్సలు కూడా అవసరమవుతాయి.
 
లేజర్‌ చికిత్సలు!
ఎలాంటి చర్మ సమస్య అయినా లేజర్‌తో నూటికి నూరు శాతం పరిష్కారమవుతుందని చెప్పలేం! సుమారుగా 50ు నుంచి 60ు మాత్రమే సమస్యను పరిష్కరించే వీలుంటుంది. లేజర్‌లో ‘అబిలేటివ్‌’, ‘నాన్‌ అబిలేటివ్‌’ అనే రెండు రకాలుంటాయి. అబిలేటివ్‌ లేజర్‌ చికిత్స తర్వాత రెండు నుంచి మూడు రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే నాన్‌ అబిలేటివ్‌లో కోలుకునే సమయం తక్కువ. మరుసటి రోజే ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఈ చికిత్సల్లో మొటిమలు, మచ్చలు, గుంటల రకం, తీవ్రతలను బట్టి డెర్మా ఫ్రాక్‌, ఐపిఎల్‌ లేజర్‌, క్యు స్విచ్‌, టార్గెటెడ్‌ ఆర్‌ఎఫ్‌ అనే లేజర్‌ చికత్సల రకాలున్నాయి.
 
పులిపిరులనూ తొలగించవచ్చు!
ముఖ చర్మం మీద పెరిగే పులిపిరుల రకాన్ని బట్టి చికిత్స ఎంచుకుని తొలగించుకోవచ్చు. నైట్రస్‌ ఆక్సైడ్‌ అనే రసాయనం ఉపయోగించి చేసే ‘క్రయోథెరపీ’ ద్వారా చేసే చికిత్స వల్ల రెండు రోజుల్లోనే పులిపిరి ఊడిపోతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స ద్వారా పులిపిరిని తాకినా పులిపిరి ఊడిపోతుంది. ఆ తర్వాత ఐదు రోజుల్లో ఆ ప్రదేశంలో చర్మం చెక్కు కట్టి తగ్గిపోతుంది.

-డాక్టర్‌ సింధూరి రెడ్డి

డెర్మటాలజిస్ట్‌, ఆంబ్రోసియా క్లినిక్‌,
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌