ఫటా ఫట్‌ మేకప్‌!

04-03-2019: ఫంక్షన్లకు, పార్టీలకు ముస్తాబయ్యేందుకు సమయం సరిపోవట్లేదని చాలామంది అమ్మాయిలు, మహిళలు వాపోతుంటారు. అయితే కొన్ని బ్యూటీ టిప్స్‌ పాటిస్తే తక్కువ టైమ్‌లోనే అందానికి మెరుగులు దిద్దొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. అందుకోసం కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే...
 
కనుబొమ్మలు: కాటుక దిద్దితే కంటికి కొత్త సొగసు వస్తుంది. వివిధ సైజు, రంగుల్లో మార్కెట్లో ఫాల్స్‌ ఐ లాషెస్‌ దొరుకుతాయి. వాటిని ధరించినా సరిపోతుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వరకూ నిలిచి ఉండే సెమీ పర్మనెంట్‌ ఐ లాషెస్‌ సెలూన్లలో లభిస్తాయి. వీటితో మీ లుక్‌ మారిపోతుంది.
 
కళ్లు: ఎక్కువ సమయం కళ్లకు మెరుగులు దిద్దక్కర్లేదు. చిన్న లైనర్‌తో గీసుకుంటే పక్కలకు నల్ల రంగు అంటదు. దీనితోనే ఫ్లిక్‌ వింగ్స్‌ గీసుకుంటే స్టయిలిష్‌ లుక్‌ వస్తుంది.
 
కురులు: ఫంక్షన్‌కు వెళ్లే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి జుట్టును ఆరబెట్టుకోవాలి. రెడీ అయ్యాక మెరుగులు దిద్దుకుంటే చాలు. జుట్టు పట్టులా మెరవాలంటే డ్రై వాల్యుమ్‌నైజర్‌ను ఉపయోగించండి.
 
లిప్‌స్టిక్‌: పార్టీలో పెదాలకు రెడ్‌ లిప్‌స్టిక్‌ ఉండాల్సిందే. వెల్వెట్‌ రకం లిప్‌స్టిక్స్‌ రోజంతా నిలిచి ఉంటాయి. పెదాలను మృదువుగా మారుస్తాయి కూడా. పెదాల మీది మృతకణాలను తొలగించిన తరువాత లిప్‌స్టిక్‌ వేసుకుంటే బాగుంటుంది.