ముఖ చర్మం మెరిసేలా...

05-02-2018: మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. ముఖ చర్మం మృదువుగా, అందంగా ఉంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. అలా కనిపించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...

ముఖ చర్మం కాంతివంతంగా ఉండాలంటే ప్రతిరోజూ క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ తప్పనిసరిగా చేయాలి.
రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
క్లెన్సింగ్‌ రోజుకు రెండు సార్లు చేసుకుంటే మొటిమల బాధ ఉండదు.
తులసి నీళ్లు టోనర్‌లా పనిచేస్తాయి. అందుకే తులసి నీళ్లల్లో దూది ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఉల్లిరసం, ముల్తానామట్టి, తేనెలు కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టు ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
నిమ్మ రసం, ఆల్మండ్‌ ఆయిల్‌, సముద్ర ఉప్పులను కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మంపై ఉన్న మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది.
శెనగపిండి, పెరుగులను కలిపి పేస్టు చేసి ముఖానికి పట్టించి అరగంటపాటు ఉంచాలి. తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే ముఖ చర్మంపై టాన్‌ పోయి, కాంతివంతంగా ఉంటుంది.
టొమాటాల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా పరిరక్షిస్తాయి. రెండు పెద్ద టొమాటోలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు.
నిమ్మ, కీర దోస రసాలను సమపాళ్లల్లో కలిపి రాసుకుంటే చర్మంపై మచ్చలు పోతాయి. 
ముఖ చర్మం సహజ కాంతితో మెరవాలంటే నీళ్లు బాగా తాగాలి. రోజూ తగినంత నిద్రపోవాలి.