మాస్క్‌లతో మెరుపులు...

12-03-2019:చర్మానికి మెరుపు తేవడానికి సౌందర్య ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. అయితే ఇవి సరైన ఫలితం ఇవ్వనప్పుడు బ్యూటీ మాస్క్‌లతో కాంతులీనే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కళ్ల కింద ముడతలు ఏర్పడడం, చర్మం బాగా పొడిబారడం వంటి సమస్యల నుంచి బ్యూటీ మాస్క్‌లతో ఉపశమనం లభిస్తుంది. ఇవి చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి కూడా.
 
చర్మ రంధ్రాలు: స్వేదగ్రంథులు మూసుకుపోవడం సమస్యగా ఉన్నవారు శాశ్వత పరిష్కారం కోసం చూస్తుంటారు. వీరికి చార్‌కోల్‌ మాస్క్‌ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఈ మాస్క్‌ను ముఖానికి పట్టిస్తే చర్మం మీద పేరుకుపోయిన దుమ్మూధూళి తొలగిపోయి ముఖం వెలిగిపోతుంది.
సున్నితమైన చర్మం: సూర్యరశ్మికి సున్నితమైన చర్మం తొందరగా కందిపోతుంది. పుట్టగొడుగుల నుంచి తయారుచేసిన బ్యూటీమా్‌స్కను రాసుకుంటే చర్మానికి సాంత్వన లభిస్తుంది.
పొడిచర్మం: ఎండకు చర్మం ఎక్కువగా పొడిబారినప్పుడు షియా బటర్‌ లేదా గ్లిజరిన్‌తో తయారైన బ్యూటీ మాస్క్‌లను ఉపయోగించాలి. దీంతో చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. అంతేకాదు ముఖానికి కాంతినిస్తుంది కూడా.
కళ్ల కింద మడతలు: ఎక్కువ పనిగంటలు, కాలేజీ అసైన్‌మెంట్‌, అధిక ఒత్తిడితో కూడిన పనులు బీజీ జీవితంలో భాగం అయ్యాయి. దాంతో చాలామంది మహిళల్లో కళ్ల కింద ముడతలు, నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలొవెరా జెల్‌, గ్లిజరిన్‌తో తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ల కింద రాసుకుంటే నల్లటి వలయాలు, ముడతలు తొలగిపోతాయి.
పెదాలు: బ్యూటీ మాస్క్‌ల వల్ల బహుళ ప్రయోజనాలుంటాయి. పగిలిన , పొడిబారిన పెదాల మీద ఆర్గానిక్‌ మాస్క్‌లు అప్లై చేస్తే పెదాలు ఆరోగ్యంగా, మృదువుగా మారుతాయి. అయితే విటమిన్‌ సి అధికంగా ఉన్న మాస్క్‌లను ఉపయోగిస్తే మరీ మంచిది.