ముఖం మెరిసిపోతుందిలా...!

03-02-2019: రోజువారీ పనులు, ఒత్తిడి, తగినంత విశ్రాంతి లేకపోవటం వల్ల చర్మం కళ తప్పుతుంది. అలాంటప్పుడు ఈ కింది సూచనలు పాటిస్తే ముఖం మెరిసిపోవటం ఖాయం అంటున్నారు సౌందర్య నిపుణులు.
 
గోల్డెన్‌ రూల్‌: రాత్రిళ్లు మేకప్‌ తీయకుండా పడుకుంటే చర్మంలోని స్వేదరంధ్రాలు పూడుకుపోతాయి. దీనివల్ల మొహంపైన మచ్చలు ఏర్పడి ఇబ్బంది పెడతాయి. అందుకే నిద్రపోయే ముందు కాటన్‌ వస్త్రంపైన కొంచెం ఆలివ్‌ ఆయిల్‌ వేసి ముఖంపైన మృదువుగా మసాజ్‌ చేస్తే మేకప్‌, దుమ్మూ తొలగిపోతాయి. ఉదయాని కల్లా మొహం క ళకళలాడుతుంది.
 
వాల్‌నట్‌ పౌడర్‌: వాల్‌నట్‌ పౌడర్‌ను పెరుగులో కలిపి ముఖంపైన రాయటం వల్ల మృతచర్మం తొలగిపోతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపైన ఉండే మృతకణాలు, దుమ్మును తొలగించి చర్మానికి కొత్త కాంతినిస్తాయి.

సన్‌స్ర్కీన్‌: ఎక్కువ సమయం ఎండలో గడిపితే చర్మం కమిలిపోతుంది. ముడత లు పడుతుంది. ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకుంటే అతి నీలలోహిత కిరణాల ప్రభావాన్ని అరికడుతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నా సన్‌స్ర్కీన్‌ వాడాలి.

బ్యూటీ స్లీప్‌: కంటికి తగినంత నిద్ర లేకపోతే చర్మం కూడా అలసిపోతుంది. దీనివల్ల కంటికింద వలయాలు ఏర్పడతాయి. వారంలో రెండు మూడుసార్లు తేనె రాయటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
 
ఫేస్‌వాష్‌: నిద్రపోయే ముందు ముఖం చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్‌ను రాయాలి. అలాగని మరీ ఎక్కువగా రాయకూడదు. వేడినీళ్లతో మొహాన్ని శుభ్రం చేస్తే చర్మం పొడిబారుతుంది. ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. దాంతో పాటు నీటి పరిమాణం ఎక్కువగా ఉండే పుచ్చ, దోస, నారింజ, ద్రాక్ష లాంటి పండ్లు తినాలి.