ఎండకు చర్మం చుర్రుమంటోందా?

ఎండ క్రమేపీ వేడెక్కుతోంది!
ఎన్నికల వేడి కూడా దేశవ్యాప్తంగా పెరుగుతోంది!
ప్రచారం లేదా ఇతరత్రా పనుల కోసం బయట తిరుగుతున్నారా?

అయితే వేడి ప్రభావం చర్మం మీద పడకుండా చూసుకోండి!
 
19-03-2019:ఎండ బాధల నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఎండలోకి అడుగు పెట్టకుండా, నీడ పట్టున ఉండాలి అనుకుంటాం! కానీ నీడలో ఉన్నా వేడి, వెలుగుల ప్రభావం వల్ల చర్మం పాడవుతుంది. నల్లబడడంతోపాటు, మంగు లాంటి చర్మ సమస్యలు, ముడతలు, మొటిమలు వేసవిలో ఎక్కువ. వీటి నుంచి చర్మాన్ని రక్షించుకోవాలంటే వేసవి మొత్తం చర్మ రక్షణకు తోడ్పడే జాగ్రత్తలు పాటించాలి.
 
సన్‌స్ర్కీన్‌ వాడకం ఇలా!
సన్‌స్ర్కీన్‌ వాడకం మీద అవగాహన పెరిగింది. దాంతో వాణిజ్య ప్రకటనల్లో కనిపించేవి, ఇతరులు సూచించేవి కొనేసి వాడేస్తూ ఉంటారు. కానీ వాటిలో పేర్కొన్నంత ఎస్‌.పి.ఎఫ్‌ కచ్చితంగా ఉంటుందనే నమ్మకం లేదు. పైగా ఆ సన్‌స్ర్కీన్స్‌ అన్ని చర్మ తత్వాలకూ సరిపడేలా తయారైనవీ అయి ఉండకపోవచ్చు. కాబట్టి చర్మ వైద్యులను కలిసి, వాళ్లు సూచించిన మెడికేటెడ్‌ సన్‌స్ర్కీన్‌ మాత్రమే వాడాలి. అందుకోసం ‘బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ సన్‌స్ర్కీన్స్‌’ ఎంచుకోవాలి. ఇవి దగ్గర మరియు దూరపు అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. సూర్యరశ్మిలోని ఐ.యు.ఎ (దూరపు కిరణాలు), బల్బుల నుంచి వెలువడే ఐ.యు.బి కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి సున్నిత చర్మ తత్వం కలిగిన వారు ఈ రెండింటి నుంచి రక్షణ కల్పించే బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ సన్‌స్ర్కీన్స్‌ వాడాలి. ఈ సన్‌స్ర్కీన్స్‌లో కెమికల్‌, ఫిజికల్‌ అనే రెండు రకాలుంటాయి. కెమికల్‌ రకం చర్మంలోకి ఇంకి రక్షణ కవచంగా పని చేస్తుంది. ఫిజికల్‌ రకం వెలుగును రిఫ్లెక్ట్‌ చేయడం ద్వారా చర్మాన్ని కాపాడుతుంది. అయితే సన్‌స్ర్కీన్స్‌ ప్రభావం సమర్ధవంతంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి.
 
ఎండలోకి వెళ్లే అరగంట ముందే సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి.బయటకు వెళ్లిన తర్వాత 3 నుంచి 4 గంటలకొకసారి తిరిగి అప్లై చేస్తూ ఉండాలి.మాయిశ్చరైజర్‌ పగటి వేళ అప్లై చేయడం వల్ల చర్మం నల్లబడే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని రాత్రికే పరిమితం చేసి, పగటివేళ సన్‌స్ర్కీన్‌ వాడకం అలవాటు చేసుకోవాలి.
 
వేసవిలో చర్మ సమస్యలు ఇవే!
వేసవి ప్రారంభంలో ఉండే ట్రాన్సిషన్‌ పీరియడ్‌ చర్మం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చలి పూర్తిగా పోకుండా, ఎండ తీవ్రంగా మారకుండా ఉండే ఈ వాతావరణంలో ‘చికెన్‌పాక్స్‌’, పిటీరియాసిస్‌ రోజియా అనే చర్మపు ఇన్‌ఫెకన్లు వస్తాయి. వేసవిలో వేధించే చెమట వల్ల ‘ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు’ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి చెమటను పీల్చే, గాలి చొరబడే కాటన్‌ దుస్తులు వేసుకోవాలి. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లను అయునా శుభ్రతతో అడ్డుకట్టవేయవచ్చు. కాబట్టి ప్రతి రోజూ రెండుసార్లు స్నానం చేయాలి.
 
ఎండలోకి వెళ్తున్నారా?
చర్మం నల్లబడకుండా ఉండాలంటే సన్‌స్ర్కీన్‌ ఒక్కటి వాడితే సరిపోదు. ఈ జాగ్రత్తలు అదనంగా పాటించాలి.
ఎండ ప్రభావం పడకుండా చేసే మందపాటి కాటన్‌ దుస్తులు ధరించాలి.
చేతులు, పాదాలకు కూడా ఎండ సోకే వీలు లేని దుస్తులు ఎంచుకోవాలి.
వెడల్పాటి టోపీ, లేదా గొడుగు ధరించాలి.
కళ్లకు చలువ కళ్లద్దాలు పెట్టుకోవాలి.
ముఖంతోపాటు, మెడ, చేతులకు కూడా అవసరమైన సన్‌స్ర్కీన్‌ వాడాలి.
ఇంట్లో ఉన్నా సన్‌స్ర్కీన్స్‌ తప్పనిసరిగా వాడాలి.
వంటగదిలో ఎక్కువ సమయం గడిపే మహిళలు కూడా వేడి ప్రభావం చర్మం మీద పడకుండా సన్‌స్ర్కీన్స్‌ రక్షణ కల్పిస్తాయి.
‘మెలాస్మా’ అనే మంగు రాకుండా ఉండాలన్నా సన్‌స్ర్కీన్‌ వాడాలి.
 
ముడతలు వదిలించే ‘ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా’!
ఎండ, కాలుష్యం ప్రభావంతో చర్మం మీద ముడతలు ఏర్పడడాన్ని వైద్యపరిభాషలో ‘ఎక్స్‌ట్రిన్సిక్‌ ఏజింగ్‌’ అంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచే సన్‌స్ర్కీన్స్‌ వాడుతూ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే ఎండ కారణంగా చర్మం మీద ముడతలు ఏర్పడి ఉంటే, వాటి ప్రదేశం, తీవ్రతలను బట్టి, ‘బొటాక్స్‌ ఇంజెక్షన్లు’, ‘రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్‌’, ‘కార్బొక్సీ థెరపీ’ల ద్వారా తగ్గించవచ్చు. కొందరు ఈ చికిత్సలలో రెండు, మూడు రకాలు కలిపి తీసుకోవలసి ఉంటుంది. రక్తం సేకరించి ప్లేట్‌లెట్లను వేరుచేసి తిరిగి ఇంజెక్ట్‌ చేసే ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్సతో ముడతలు తొలగి చర్మం నునుపుగా తయారవుతుంది. ఈ ఫలితం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అన్ని విధాలా సురక్షితమైన
చికిత్స ఇది.
 
మొటిమలకు ‘హాలీవుడ్‌ పీల్‌’!
వేసవిలో జిడ్డు చర్మం కలిగిన వారిని మొటిమలు వేధిస్తాయి. ఈ సమస్య వదలాలంటే రాత్రివేళ ‘యాంటీ యాక్ని క్రీమ్స్‌’ వాడవలసి ఉంటుంది. రోజులో ముఖాన్ని కనీసం రెండు నుంచి మూడు సార్లు కడుక్కోవాలి. మొటిమలు పోయినా మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. ఆ మచ్చలను ‘హాలీవుడ్‌ పీల్‌’ చికిత్సతో వదిలించవచ్చు. ఈ చికిత్సతో తెరుచుకుని ఉండే చర్మ రంధ్రాలు మూసుకుని, మొటిమలు అదుపులోకి వస్తాయి.
 
నలుపు వదిలించే ‘లేజర్‌ టోనింగ్‌’!
ఎండకు కోల్పోయిన చర్మపు రంగును త్వరగా తెప్పించుకోవాలనే తాపత్రయం ఉంటుంది. అలాంటప్పుడు అనుభవజ్ఞులైన వైద్యులు సూచించే సౌందర్య చికిత్సలను ఆశ్రయించవచ్చు. వేసవిలో కొందరికి చర్మం మీద మచ్చలు కూడా ఏర్పడతాయి. దీన్నే ‘పిగ్మెంటేషన్‌’ అంటారు. దీనికి స్కిన్‌ లైటెనింగ్‌ క్రీమ్స్‌ వాడాలి. ఎండ వల్ల వచ్చిన నలుపు తక్కువ సమయంలో వదలాలంటే ‘కెమికల్‌ పీల్స్‌’ లేదా ‘లేజర్‌ టోనింగ్‌’ అవసరమవుతుంది. లేజర్‌ టోనింగ్‌తో చర్మం మీది మచ్చలు, ఎండ వల్ల వచ్చిన నలుపు వదిలి చర్మం మెరుపు సంతరించుకుంటుంది. 3 వారాల గ్యాప్‌తో 3 లేదా 4 విడతల్లో పూర్తయ్యే ఈ చికిత్సకు దుష్ప్రభావాలూ ఉండవు. ముఖంతోపాటు, మెడ, ముంజేతులకు కూడా ఈ చికిత్స తీసుకోవచ్చు. చికిత్స తర్వాత క్రమంతప్పకుండా సన్‌స్ర్కీన్స్‌ వాడుతూ జాగ్రత్తగా కాపాడుకుంటే, ఎక్కువకాలం చర్మపు మెరుపు నిలిచి ఉంటుంది.
డాక్టర్‌ డి. సుధా వాణి,సీనియర్‌ కన్సల్టెంట్‌,శ్రీ స్కిన్‌ అండ్‌ కాస్మటాలజీ సెంటర్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.
 
హోలీ రంగులతో జాగ్రత్త!
ఈ సరికే అందరూ రంగులను సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే హోలీలో వాడే రంగులు, తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకోండి. రంగులు చర్మానికి అంటుకోకుండా కొబ్బరినూనె లేదా మరేదైనా నూనె రాసుకోవాలి. నూనె చర్మం మీద ఒక పొరలా ఏర్పడి రంగులు చర్మంలోకి ఇంకకుండా ఉంటాయి. రంగుల వల్ల పెదవులు ఎండిపోకుండా, రంగు మారకుండా పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. హోలీ ముందు లేదా తర్వాత కొద్ది రోజులపాటు బ్యూటీ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండాలి. హోలీ కోసం కూరగాయలతో తయారైన రంగులు వాడడం శ్రేయస్కరం. హోలీ ఎండలో ఆడుతూ ఉంటారు. పైగా రంగు నీళ్లలో తడుస్తూ ఉంటారు. కాబట్టి చర్మం మరింత నల్లబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం 30 ఎస్‌.పి.ఎఫ్‌ ఉన్న సన్‌స్ర్కీన్‌ తప్పనిసరిగా వాడాలి. శరీరం మొత్తం కప్పి ఉంచే కాటన్‌ దుస్తులు ధరించాలి.