ఇలా చేస్తే... మచ్చలు మాయం!

31-01-2019: హైపర్‌ పిగ్మెంటేషన్‌ వల్ల చర్మం రంగు మారటమే గాక మొహంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. మెడ, కాళ్లు, చేతుల మీదా ఈ సమస్య తలెత్తవచ్చు. శరీరం మెలనిన్‌ను అధికంగా ఉత్పత్తి చేయటమే దీనికి కారణం. ఆరోగ్య సమస్యలు, గర్భం దాల్చటం, హార్మోన్ల మార్పులాంటి అంతర్గత కారణాలు.. ఎండ ప్రభావం, చర్మం గాయాలపాలవటం, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల రసాయనాలు వంటి బాహ్య కారణాలు హైపర్‌ పిగ్మెంటేషన్‌కు దారి తీస్తాయి. 

పచ్చి బంగాళ దుంపతో ఈ సమస్యను నివారించవచ్చు. ఇందులో ఉండే కాటెకోలాజ్‌ అనే ఎంజైమ్‌ అధిక మెలనిన్‌ ఉత్పత్తిని నిరోధిస్తుంది. చర్మంపైన మచ్చలు లేకుండా చేసి మంచి ఛాయను ఇస్తుంది.

శుభ్రంగా కడిగిన బంగాళ దుంపను రెండు ముక్కలుగా కోయాలి. లోపల వైపు కొంచెం నీళ్లు చిలకరించాలి. చర్మంపైన మచ్చలు ఉన్న చోట గుండ్రంగా ఆ ముక్కలను రెండు నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజుకు నాలుగు సార్లు, నెల రోజుల పాటు చేస్తే హైపర్‌ పిగ్మంటేషన్‌ బారి నుంచి బయటపడొచ్చు. మంచి శరీర ఛాయను సొంతం చేసుకోవచ్చు.