మెంతులతో ముగ్ధంగా...

11-06-2019: అందంగా ఆకర్షణీయంగా కనిపించాలనే తపన చాలామందిలో చూస్తాం. అందుకు ఖరీదైన కాస్మొటిక్స్‌ సైతం వాడుతుంటారు. కానీ వంటింట్లో అందుబాటులో ఉండే మెంతులతో చర్మాన్ని మెరిసేలా చేయొచ్చు! మరెన్నో చర్మ సమస్యలను సైతం తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్‌ ...
 
మెంతిపొడితో చర్మ సమస్యలు అదుపులో ఉంటాయి. మొటిమలు, మచ్చలు మెంతి పొడితో ఇట్టే పోతాయి.
మెంతులు (పొడి చేసి), పసుపు, దోసకాయ గుజ్జు ఈ మూడింటి మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నీరు, సున్నం తేట వేసి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంటసేపు ఉంచుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు పోతాయి. స్కిన్‌ టెక్చర్‌ పట్టులా ఉంటుంది.
 
చుండ్రు, ఫంగస్‌ నివారణకు మెంతులు, నిమ్మరసం, వెల్లికారం సమపాళ్లల్లో తీసుకుని మెత్తగా నూరి తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టురాలిపోవడం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా పోతాయి. ఈ పేస్టు యాంటి ఫంగల్‌గా పనిచేస్తుంది. వెల్లికారం యాంటిబయొటిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసం జిడ్డు పోగొడుతుంది.
 
జుట్టు రాలుతున్నా, వెంట్రుకలు రాగి రంగులోకి మారుతున్నా మెంతులు బాగా పనిచేస్తాయి. వారానికి ఒకసారి మెంతిపొడి, మారేడు గుజ్జు సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి ఆ పేస్టును తలకు పట్టించాలి. దాన్ని గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది.
 
చమట వాసన తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతులు, నల్ల ఉలవలు, గంధ ఖర్జూరాలు, కరక్కాయలను మెత్తగా పొడి చేసి దానితో శరీరానికి నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎక్కువ చెమట పట్టదు. శరీరం నుంచి దుర్గంధం రాదు.