బ్యూటీ విత్‌ బీట్‌రూట్‌!

17-09-2019:బీట్‌రూట్‌లో విలువైన విటమిన్లతో పాటు ఖనిజ లవణాలూ ఉంటాయి. దీన్ని ఆహారంగానే కాదు సౌందర్య పోషణకూ వాడుకునే వీలుంది. దీన్లోని పోషకాలు చర్మానికి కొత్త జీవాన్నిస్తాయి. కాబట్టి బీట్‌రూట్‌ ప్యాక్స్‌తో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
 
గులాబీ మెరుపు!
ఆరు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసంలో దూది ఉండలు ముంచి, వాటిని ముఖం మొత్తం పరుచుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన క్లాత్‌తో ముఖం తుడుచుకోవాలి. ప్యాక్‌ వేసేటప్పుడు, తొలగించేటప్పుడు చేతి వేళ్లు ముఖానికి తగలకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్యాక్‌తో ముఖం గులాబీ రంగుతో మెరిసిపోతుంది.
 
తాజాదనం సొంతం
రెండు టేబుల్‌ స్పూన్ల బీట్‌రూట్‌ గుజ్జులో, అంతే పరిమాణంలో నిమ్మరసం కలిపి కొద్దిగా రోజ్‌ వాటర్‌ చేర్చి, ప్యాక్‌ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మీద మచ్చలు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
తేమ కోసం...
ఒక టేబుల్‌ స్పూను బీట్‌రూట్‌ రసంలో అర టీస్పూను పసుపు, అర టీస్పూను మీగడ, రెండు టీస్పూన్ల సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌గా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేమగా ఉంటుంది.