అందంగా...ఆరోగ్యంగా!

11-04-2019: అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే మేకప్‌ తప్పనిసరి అనుకుంటాం! కానీ మేకప్‌ వేసుకోకపోయినా కొన్ని చర్మ రక్షణ సాధనాలతో, చర్యలతో మేకప్‌ లుక్‌ తెప్పించే వీలుంది. అదెలాగంటే....

 
మాయిశ్చరైజర్‌: చర్మం తేమగా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ తప్పనిసరి. దీన్లో సన్‌ ప్రొటెక్షన్‌ ఫార్ములా కలిగిన టింటెడ్‌ రకం మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. ఫౌండేషన్‌ బదులుగా దీన్ని ముఖం మీద అప్లై చేయాలి. దీంతో మేకప్‌ వేసిన మెరుపు అందుతుంది. చర్మానికి సూర్యరశ్మి నుంచి కూడా రక్షణ దొరుకుతుంది.
 
 
విటమిన్‌ సి: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగాలి. విటమిన్‌ సి శరీరంలోని ఫ్రీరాడికిల్స్‌ను వదిలించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
 
టోనర్‌: ముఖం కడిగిన వెంటనే ఆల్కహాల్‌ లేని టోనర్‌ అప్లై చేయాలి. దీంతో చర్మం నునుపుగా మారుతుంది.
 
ఎక్స్‌ఫోలియేట్‌: వారానికి రెండు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. ఇందుకు సమపాళ్లలో కలిపిన బేకింగ్‌ సోడా, నీళ్లు వాడాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి, సున్నితంగా మర్దన చేసి, చల్లనీళ్లతో కడిగేసుకోవాలి.
 
చేతులు దూరం: తరచుగా ముఖాన్ని చేతులతో తాకే అలవాటు మానుకోవాలి. ఇలా చేయడం వల్ల సూక్ష్మక్రిములు చర్మంలోకి చేరి మొటిమలు కలగజేస్తాయి. అలాగే ముఖం మీద వచ్చే మొటిమలను గిల్లకూడదు. ముఖం మీద చేతులు ఉంచి చర్మాన్ని లాగడం లాంటివి చేయకూడదు.