ఈ స్నానంతో నవతేజం

ఆంధ్రజ్యోతి, 11-07-2017: ఎంత క్లాసిక్‌ దుస్తులు ధరిస్తేనేమిటి?.. ఆ దుస్తులన్నీ పశువులు తొక్కినట్టు ముడతలు?.. ఇదేమిటంటే ఎప్పుడు చూసినా ఒకటే గోక్కోవడం రక్కుకోవడం!.. ఎందుకూ అంటే ఏం చెప్పాలి... ఒళ్లంతా ఒకటే మంటలు, పోట్లు. నిలువెల్లా మలినాలు పేరుకుపోయి శరీరమంతా నిప్పుల కుంపటైపోతే ఏమవుతుంది మరి? మలినాల వల్ల సమస్త చర్మరోగాలకూ శరీరం నిలయమవుతుంది. వీటి నివారణ కోసం వచ్చినవే ప్రకృతి సిద్ధమైన మట్టి చికిత్సలు. ప్రకృతి చికిత్సలు.

 
మట్టితో మనిషి బంధమేమిటి?
మనం తీసుకునే ఆహార పానీయాలన్నీ మట్టిలోంచి వచ్చినవే. ఆ మాటకొస్తే మనిషి పుట్టిందే మూలభూతమైన మట్టిలోంచి. అందుకే మట్టినీ మనిషినీ వేరు చేయలేం. పుట్టినప్పుడే కాదు మనిషి జీవితమంతా మట్టితోనే ముడివడి ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణలోనూ అనారోగ్య విముక్తిలోనూ మట్టి పాత్ర ఎంతో కీలకం. అందుకే ప్రకృతి వైద్య చికిత్సా విధానంలో మట్టితో స్నానానికి (మృత్తికా స్నానం) ఒక విశేషమైన స్థానం ఉంది.
 
నాడుల ఉత్తేజానికి..
పొత్తికడుపును గర్భకుహరపు మెదడు (అబ్డామినల్‌ బ్రెయిన్‌) అని కూడా పిలుస్తారు. ఇక్కడినుంచి 72 వేల నాడులు బయల్దేరి శరీరానికంతటికీ శక్తినిస్తుంటాయి. కొందరిలో ఈ ప్రదేశం చాలా వేడిగా ఉంటూ, మల, మూత్ర దోషాల్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వేడి వల్ల మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, లేదా మూత్ర విసర్జన సాఫీగా జరగ కపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కొందరిలో మలం కూడా సాఫీగా విడుదల కాక ఉండలుగా లేదా మరీ గట్టిగానూ తయారవుతుంది. ఇది పలు రకాల వ్యాధులకు మూలమవుతుంది ఈ పరిస్థితులను నివారించడంలో మడ్‌ ప్యాక్‌ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి.
 
మట్టితో చేసే చికిత్సలు రెండు రకాలు..
శరీరమంతా బురద పూసే చికిత్సను ’మడ్‌బాత్‌‘ అనీ శరీరంలోని ఏ భాగానికి ఆ భాగం విడివిడిగా పట్టీలు వేయడాన్ని ‘మడ్‌ప్యాక్‌’ అనీ అంటారు. ఈ మట్టి చికిత్సల వల్ల శరీర అధిక ఉష్ణం, రక్తంలోని విషదోషాలు, మంటలు తగ్గిపోతాయి. సెగగడ్డలు మాయమవుతాయి. పలురకాల చర్మ వ్యాధులను తగ్గించడంలో ఇది తిరుగులేని వైద్యంగా పనిచేస్తుంది.
 
ఏ మట్టి వాడాలి?
నల్లనేల, ఎర్రనేల, ఇసుక నేల అంటూ నేల మూడు రకాలుగా ఉంటుంది. వీటిల్లో మిగతా వాటికన్నా నల్లనేల శ్రేష్టం. నల్లరేగడి, ఒండ్రు మట్టి, ఒంటికి చలువ చేస్తాయి. ఎర్రమట్టి వేడిచేస్తుంది. తెల్ల (ఇసుక) మట్టి సమశీతోష్ణంగా ఉంటుంది. ప్రకృతి వైద్య చికిత్సలో నల్లరేగడి మట్టి, ఒండ్రుమట్టి పుట్టమట్టిని మాత్రమే ఉపయోగిస్తారు. అయితే, నదీ ప్రవాహాల ఒడ్డున ఉండే మట్టి గానీ కాలువ ఒడ్డున దొరికే ఒండ్రు మట్టి ఈ చికిత్సలకు ఎంతో శ్రేష్టం. ఇది లభించనప్పుడు చెరువులు, కుంటలు, పంట పొలాల్లో లభ్యమయ్యే నల్లరేగడి మట్టిని సేకరించి పెట్టుకోవాలి. ఈ మట్టి చెత్తా చెదారం, దుర్వాసన లేకుండా ఉండేలా శుభ్రం చేసుకోవాలి.
 
మట్టిలో రాళ్లు, రప్పలూ, చెత్తా చెదారం లాంటివి ఉంటే వీటిని పూర్తిగా ఏరివేసి, మెత్తగా దంచి, జల్లించి, ఎండబెట్టి భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత ఈ మట్టిని అవసరానికి సరిపడా కుండలో నానపెట్టాలి. మరీ జారుగా కాకుండా పిండివంటలకు తయారు చేసే తరహాలో కాస్త గట్టిగానే ఉండే లా నీరు పోసి నానపెట్టాలి.
12 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు గల గుడ్డను నీటిలో బాగా తడిపి, పిండి ఒక పీట మీద గానీ, బల్ల మీద గానీ, పరిచి ఉంచాలి. ఇలా పరిచిన గుడ్డ మధ్య నానపెట్టిన మట్టిని ఒక అంగుళం మందాన 8 అంగుళాల పొడవునా 4 అంగుళాల వెడల్పునా ఉంచాలి. మట్టిలేని మిగతా గుడ్డను నాలుగు వైపులా మట్టి పైకి మడిచి, రోగి బొడ్డు కింది భాగంలో పొత్తి కడుపు పై ఉంచాలి. ఈ మడ్‌ ప్యాక్‌ను 15 నిమిషాల మొదలు అవసరాన్ని బట్టి గంట దాకా కూడా ఉంచవచ్చు.
కొన్ని పరిస్థితుల్లో గుడ్డ లేకుండానే ఒండ్రు మట్టిని పొత్తి కడుపు మీద పూయాలి అయితే ఈ మట్టి ఆరిపోగానే తిరిగి రాస్తూ ఉండాలి. అలా అనుకున్న సమయంలో పదే పదే రాస్తూ ఉండాలి.

ఆ తర్వాత మడ్‌ ప్యాక్‌ తీసివేసి, చల్లటినీటితో కడగాలి. ఈ చికిత్స వల్ల 72 వేల నాడులు చైతన్యం పొంది, అధికోష్ణం త గ్గుతుంది. ఎంతో కాలంగా నెలకొన్న అస్వస్థత తొలగిపోయి ఆరోగ్యం చక్కబడుతుంది.

డాక్టర్‌ టి.కృష్ణమూర్తి
సూపరింటెండెంట్‌,
రెడ్‌క్రాస్‌ నేచర్‌ క్యూర్‌ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌