కాస్మెటిక్స్‌ కొనే ముందు...

20-11-2017: మనం తినే ఆహారంలోనే కాదు, బ్యూటీ ఉత్పత్తుల్లో సైతం అనారోగ్యకారకాలైన విషపదార్థాలు బోలెడు ఉన్నాయి. అందం కోసం మనకు తెలియకుండానే రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతూ శరీరాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం. దీనికితోడు చాలామంది కాస్మెటిక్స్‌ కొనేటప్పుడు వాటిల్లో ఉన్న రసాయన పదార్థాలేమిటన్న దానిని గమనించరు. ఫలితంగా రకరకాల చేదు అనుభవాలను ఎదుర్కోవలసి వస్తుంది.

సౌందర్య ఉత్పత్తుల్లో ఉండే విష పదార్థాల్లో ఒకటి పెరాబియన్స్‌. ఇది యాంటీబ్యాక్టీరియల్‌ ప్రిజర్వేటివ్‌. దీని వల్ల రొమ్ము కాన్సర్‌, హార్మోన్ల సమస్యలు, రకరకాల ఎలర్జీలు, వ్యంధత్వం వంటివి తలెత్తుతాయి. సౌందర్య ఉత్పత్తుల్లో పెట్రోకెమికల్స్‌ బాగా వాడతారు. ఇవి కార్సినోజిన్‌ను ఉత్పత్తిచేసి, చర్మంలోని సున్నితత్వాన్ని పోగొట్టడమే కాకుండా ఎక్కువ వయసున్న వారిలా కనపడేట్టు చేస్తాయి.

అలాగే కృత్రిమమైన సువాసనలు వెదజల్లే సౌందర్య ఉత్పత్తుల వినియోగం వల్ల ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యల బారిన పడతాం. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాయి.

బ్యూటీ ఉత్పత్తుల్లో ఉండే సోడియం లారిల్‌ సల్ఫేట్‌, సోడియం లారెత్‌ సల్ఫేట్‌లు డిటర్జెంటులు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా జుట్టు సన్నబడ్డం వంటివి తలెత్తుతాయి. కాస్మెటిక్స్‌లోని ట్రిక్లోసాన్‌ రసాయనం సింథటిక్‌ యాంటీ బాక్టీరియల్‌. ఇది పురుగులమందు. దీన్ని ఎక్కువగా హ్యాండ్‌ శానిటైజర్లలో ఉపయోగిస్తారు.

బ్యూటీ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఫెలేట్లు ఎండోక్రైన్‌ని త్రీవంగా దెబ్బతీస్తాయి. ఇవి పునరుత్పత్తి వ్యవస్థతోపాటు నరాలను దెబ్బతీస్తాయి. అందుకే రసాయనాలతో కూడిన కాస్మెటిక్స్‌ను వాడకుండా సహజమైన సౌందర్య ఉత్పత్తులను వాడడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇది వైద్యులు, సౌందర్య నిపుణులు చెబుతున్న మాట.