పెదవులకు రంగులద్దే ముందు ఇలా చేయండి..!

14-12-2017: పెదాలకు లిప్‌స్టిక్‌ వేసుకునేవారు సరైన లిప్‌స్టిక్‌ను ఎంచుకునే ముందు పెదవుల సంరక్షణపై దృష్టిపెట్టాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అప్పుడే పెదవులు తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. పెదవులపై పేరుకున్న మృతచర్మాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. వాటిని టూత్‌బ్రష్‌తో రుద్దితే సరిపోతుంది. పెదవులు పగిలిపోకుండా ఎప్పటికప్పుడు లిప్‌బామ్‌ రాసుకుంటే మంచిది. పెదవుల ఆకృతిని గమనించుకుని వాటికి తగిన లిప్‌స్టిక్‌ రంగుల్ని ఎంచుకోవాలి. ముదురు రంగులు పెదాల్ని చిన్నగా కనిపించేలా చేస్తాయి. లేత, ప్రకాశవంతమైనవి పెద్దగా కనిపించేలా చేస్తాయి. పెదాల్ని హైలైట్‌ చేసుకోవాలా వద్దా అన్నదాన్ని బట్టి రంగుల్ని ఎంచుకోవాలి.

చామనఛాయ ఉన్న వారు ఎరుపు, కాషాయం, గులాబీ వంటివి ప్రయత్నించవచ్చు. తెల్లగా ఉన్నవారికి ఎరుపుతో పాటు నీలంటోన్‌ వచ్చే లిప్‌స్టిక్‌లూ చక్కగా నప్పుతాయి.

ముదరు రంగు చర్మతత్వం ఉన్న వారు బ్రౌన్‌ రెడ్‌, ప్లమ్‌ షేడ్‌లను ప్రయత్నించవచ్చు. మరీ కొట్టొచ్చినట్లు కనిపించే గులాబీ కాషాయం వంటివి వేసుకోకూడదు. అవి వేసుకుంటే మరీ పెద్దగా కనిపిస్తాయి. చామనఛాయ ఉన్నవారు ముదురు గులాబీ, బ్రౌనిష్‌ రెడ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. లేత రంగులు వీరికి అంతగా నప్పవు. లిప్‌స్టిక్‌ వేసుకుని చూసుకోవాలనుకుంటున్నపుడు సహజ వెలుతురులో ప్రయత్నించాలి.