ఒత్తయిన కనుబొమల కోసం...

06-08-2018: కనుబొమలు ముఖసౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. ధనస్సులా వంగినట్టుండే కనుబొమలు ఒత్తుగా కూడా ఉంటే మరింత ఇంపుగా కనపడతారు. అంతేకాదు కనుబొమలు ఒత్తుగా ఉంటే వయసు కనపడదు! అందుకే ఒత్తయిన కనుబొమల కోసం వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవి...
 
ఉల్లిపాయ రసాన్ని కనుబొమలకు రాసి నాలుగు గంటలు అయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
రాత్రి పడుకోబోయే ముందు కొన్ని కొబ్బరినూనె చుక్కల్ని వేళ్ల తో కనుబొమలపై రాసి మసాజ్‌ చేయాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో కనుబొమలను కడుక్కోవాలి.
పచ్చిపాలను కనుబొమలకు రాసి మసాజ్‌ చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
కలబంద కనుబొమలకు మంచి షేపు ఇవ్వడంలో సహాయపడుతుంది. అందుకే కలబంద గుజ్జును తీసుకుని కనుబొమలపై రాసి సున్నితంగా మసాజ్‌ చేయాలి. కాసేపైన తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి.
గుడ్డు పచ్చసొనలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కనుబొమలు పెరగడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే గుడ్డు పచ్చసొనను కనుబొమలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో వాటిని శుభ్రంగా కడుక్కోవాలి.
ఆముదం కనుబొమలు ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది. కొన్ని చుక్కల ఆముదాన్ని చేతిలో వేసుకుని కనుబొమలకు రాసి మసాజ్‌ చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో వాటిని శుభ్రం చేసుకోవాలి.
కొద్దిగా నిమ్మరసం తీసుకుని దాన్ని కనుబొమలపై రాసి పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
కనుబొమలు ఒత్తుగా పెరగడానికి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కూడా బాగా సహాయపడతాయి. లావెండర్‌ ఆయిల్‌, రోజ్‌ ఆయిల్‌ ల్లాంటివి కనుబొమలకు రాసుకుంటే వొత్తుగా పెరుగుతాయి.