ఉల్లితో అందం

10-02-2019:ఉల్లిపాయలు వంటకే కాదు, సౌందర్య పోషణకూ ఉపయోగపడతాయి. చర్మ రక్షణకు అవసరమైన పోషకాలు ఉల్లిలో బోలెడన్ని. కాబట్టి ఉల్లిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం!
 
నల్లని ముఖచర్మం: బ్లాక్‌ పిగ్మెంటేషన్‌ వల్ల ముఖచర్మం నల్లగా మారి, పొడిబారుతుంది. ఈ ఇబ్బంది వదలాలంటే ఉల్లి రసంలో సెనగపిండి, మీగడ కలిపి ముఖం మీద అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నాలుగు వారాలు చేస్తే పిగ్మెంటేషన్‌ తగ్గి చర్మం తెల్లగా మారుతుంది.
చర్మపు మెరుపు: చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లి రసాన్ని నేరుగా ముఖం మీద పూసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌, విటమిన్లు చర్మానికి సరిపడా పోషణను అందించి, ఆరోగ్యాన్ని సంతరించి పెడతాయి.
దోమ, పురుగు కాట్లు: ఉల్లి రసం నొప్పి నివారిణి. కందిపోవడం, వాపును కూడా తగ్గిస్తుంది. కాబట్టి దోమ కాటుకు, పురుగు కాటుకు కందిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని పూయాలి.