ముఖం మెరవాలంటే...

ఆంధ్రజ్యోతి, 23-01-2019: చలికి చర్మం తొందరగా పొడిబారిపోతుంది. దాంతో కాంతి కోల్పోతుంది. ఈ సీజన్‌లో పళ్లతో ఇంటివద్ద తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌తో ముఖకాంతిని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ ఫ్రూటీ ఫేస్‌ప్యాక్స్‌ ఎలా చేయాలో చూద్దాం...

 
నారింజ: ఎండిన నారింజ తొక్కలను పొడి చేసి, టీ స్పూను ఓట్‌మీల్‌, కొన్ని చుక్కల తేనె, కొద్దిగా యోగర్ట్‌ కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది.
 
యాపిల్‌: పెద్ద యాపిల్‌ పండు తీసుకొని దాని పై తోలు తీసేయాలి. యాపిల్‌ గుజ్జుకు కొన్ని చుక్కల తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లైచేసి 15 నిమిషాల తరువాత వేడి నీళ్లతో కడిగేస్తే సరి.
 
అరటిపండు: బాగా మగ్గిన రెండు అరటిపళ్లను గుజ్జులా చేయాలి. దీనికి కొద్దిగా తేనె, స్పూను యోగర్ట్‌ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో రాసుకొని 15 నిమిషాలయ్యాక నీళ్లతో కడిగేయాలి. ఈ పేస్టుకు ఓట్‌మీల్‌ కూడా కలిపితే చర్మం మీది మృత కణాలు తొలగిపోతాయి.