చెప్పుకోలేని ట్రబుల్‌ గ్యాస్‌ ట్రబుల్‌!

ఆహార పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు తయారైన అధిక గాలి పూర్తిగా బయటకు పోకుండా కడుపులోను, పేగుల్లో నిండిపోయినపుడు కడుపు ఉబ్బిపోయి ఆపానవాయువులతో నలుగురిలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. చివరికి నవ్వులపాలు చేస్తుంది. దీనినే గ్యాస్‌ ట్రబుల్‌ అంటున్నారు. ఆయుర్వేదంలో ‘‘అధ్మాన’’ అని పిలుస్తారు.

కడుపులో తయారైన గాలి తేపుల ద్వారా గాని, పురీషనాళం ద్వారా గానీ పోకుండా పైకి ఎగబాకినపుడు గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువై నాడి వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. గుండె దడగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పిని గుండెనొప్పిగా కూడా అపోహ పడటం జరుగుతుంది. ఈ రకంగా కడుపులో గాని, పేగుల్లో గాని అధికగాలి ఏర్పడటానికి కారణం సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండిపోయి మురిగి పోవడం జరుగుతుంది. ఈ రకంగా మురికి పోయిన పదార్థాలనుండి బయలు దేరిన విషవాయువులే కడుపులోను, పేగుల్లోను గాలిగా నిండిపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.

గ్యాస్‌ ట్రబుల్‌కి అసలు కారణం మలబద్ధకమేనని చెప్పాలి. కాబట్టి మలబద్ధకం లేకుండా ముందు చర్యలు తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే ఏ విధమైన బరువు పనులు చేయకూడదు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. భోజన సమయంలో మానసిక విచారం, మానసిక వత్తిడి, వ్యతిరేక ఆలోచనలు పనికిరావు. వేపుడు కూరలు, పప్పు పదార్థాలు, అన్ని రకాల చిక్కుళ్ళు తినకూడదు. పాలు బదులు, మజ్జిగ, పెరుగు వాడుతుండాలి.

కొన్ని సులభ చికిత్సలు

1. ప్రతి రోజు ఉదయాన్నే అరటి బోదలోని సన్నని గట్టిగా ఉండే ‘అరటి ఊచ’ రసాన్ని ఒక కప్పుడు తాగుతుంటే 15-20 రోజుల్లో గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

2. అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్‌ స్పూన్‌ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మల మూత్రాలు సులభంగా అవుతాయి.

3. 40 గ్రాముల ఎండు ద్రాక్షపళ్ళను రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పండ్లను బాగా పిసికి వడగట్టి తాగుతుంటే సులభంగా విరేచనమై కడుపులోని చెడుగాలి పోతుంది. 

4. శొంఠి చూర్ణం, పాత బెల్లంతో సమంగా కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తిని వేడి నీరు తాగితే సులభంగా విరేచనమై కడుపులో చెడుగాలి పోతుంది. దీనివల్ల మూలవ్యాధి, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

5. ధనియాలు, శొంఠి సమభాగాలు కలిపి కషాయం పెట్టి కప్పు కషాయం ఉదయాన్నే తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గి గ్యాస్‌ట్రబుల్‌ కూడా తగ్గిపోతుంది.

6. సోంపు, జీలకర్ర, వాయు సమభాగాలు చూర్ణం చేసి కలిపి టీ స్పూన్‌ రోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో వాడితే కడుపులోని చెడుగాలి పోయి శుభవిరేచనం అవుతుంది.

7. సునాముఖి ఆకుపౌడరు, కరక్కాయ పౌడరు సమభాగాలుగా కలిపి రోజూ ఒక గ్రాము మూడు పూటలా వాడితే సులభంగా విరేచనమై చెడుగాలి 
తగ్గిపోతుంది.
 
 
డాక్టర్‌ కందమూరి
ఆయుర్విజ్ఞాన కేంద్రం