ఆయుర్వేదం అండతో!

29-01-2019: పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడటానికి వాళ్ల రక్తనాళాలు పురుషుల కన్నా సన్నగా ఉండడం ఒక ప్రధాన కారణం. రక్తనాళాల్లో కొవ్వు కూడా పేరుకుంటే అది మరో కారణం అవుతుంది. వీటికి తోడు స్థూలకాయం, మధుమేహం, మానసిక ఒత్తిళ్లు, శరీర శ్రమ లేకపోవడం, మెనోపాజ్‌, స్త్రీల గుండె పోటుకు ఇతర కారణాలవుతాయి. మౌలికంగా, నిత్యం గుండె ద్వారా జరిగే రక్త-పరిభ్రమణానికీ, రుతుస్రావానికీ మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల రుతుక్రమం అస్తవ్యస్తం అయినప్పుడు, అది గుండె పనితనాన్ని ప్రభావితం చేసి గుండె జబ్బులకు కారణం కావచ్చు. నిజానికి, రుతుధర్మం స్త్రీల శరీర మాలిన్యాలను శుభ్రపరిచే ఒక రక్తమోక్షణ ప్రక్రియ. ఆ ప్రక్రియ కుంటుపడితే గుండె పనితనంలో మార్పులు రావడం సహజం. అందువల్ల రుతుక్రమం విషయాల్లో ఏ కాస్త తేడా వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన వైద్య చికిత్సలను తీసుకోవడం తప్పనిసరి.
 
ఇతర కారణాల్లోకి వెళితే, ముఖ్యంగా ఆహారం విషయంలో, అమితాహారం, విరుద్దాహారం తీసుకోవడం, రక్తహీనత, అజీర్తి సమస్యలు కూడా రక్తప్రసరణ వ్యవస్థ కుంటుపడటానికీ, అంతిమంగా గుండె జబ్బులు రావడానికీ దారితీస్తాయి.
మౌలికంగా గుండె జబ్బులు రావడానికి శారీరక కారణాలతో పాటు, మానసిక ఒత్తిళ్లూ కారణమే కాబట్టి, వీటిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలి.
సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతో పాటు ద్రవాహారానికీ, పళ్లరసాలకు ప్రాధాన్యతనివ్వాలి. రోజుకు నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం కూడా అంతే అవసరం.
గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వు, ఇతర కల్మషాలు తొలగిపోవడానికి గృహవైద్యంగా, వెల్లుల్లి, అల్లం, శొంఠి, ఆవాలు, పసుపు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి.
సాధారణ ఔషధమూలికల్లో మద్ది (అర్జున) యష్టిమధు, పుష్కరమూలం, పిప్పళ్లు, వాము వీటిని ప్రతిరోజూ తీసుకోవచ్చు.
ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ప్రభాకరవటి, నాగార్జునాభ్ర, హృదయార్ణవ రసం, యోగేంద్ర రసం, అర్జునారిష్ట, దశమూలారిష్ట, అఖీక పిష్టి వంటి శాస్త్రీయ ఔషధాలను వాడుకుంటూ హృద్రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు కూడా. అయితే, హృద్రోగాల విషయాల్లో ఔషధ చికిత్సలకు వెళ్లాలా? శస్త్ర చికిత్సలు అవసరమా? అనే నిర్ణయాన్ని రోగ నిర్ధారణా పరీక్షల ఆధారంగానే తీసుకోవాలి.
ప్రొఫెసర్‌ చిలువేరు రవీందర్‌
ప్రభుత్వ బి.ఆర్‌. కె.ఆర్‌ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌