10-02-2018: నాకు 28 ఏళ్లు. గత సంవత్సర కాలంగా మలంలో రక్తం పడుతోంది. ఓ వారం పాటు ఈ సమస్య వేధించి, ఆ తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత ఓ నెల రోజుల తర్వాత మళ్లీ సమస్య మొదలవు తుంది. డాక్టర్ని కలిస్తే ఇది పైల్స్ సమస్య అనీ, దీనికి శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేదనీ చెప్పారు. నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. నా సమస్యకు సరైన మందులేవైనా ఉంటే తెలుపగలరు.
సురేష్, యానాం
మలంలో రక్తం పడటానికి చాలా కారణాలుంటాయి. కాబట్టి రోగిని పరీక్షించనిదే చెప్పడం కష్టం. పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్యులా, చివరికి అమీబియాసిస్తో కూడా ఇలా మలంలోంచి రక్తం పడుతూ ఉంటుంది. మీకున్నది పైల్స్ సమస్యే అయితే, దానికి మలబద్ధకమే ప్రధాన కారణం. నిరంతరం మలబద్దకంతో బాధపడేవాళ్లలో రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువై చిట్లిపోయి ఇలా రక్తం పడే అవకాశం ఉంటుంది. ఆహారంలో పీచుపదార్థాల మోతాదు చాలా తక్కువగా ఉండడం, నీళ్లు తక్కువగా తాగడం, పెద్దగా శరీర శ్రమ లేక పోవడం ఈ సమస్యకు దారి తీస్తాయి. ఈ మూడు విషయాల్లో పద్ధతిగానే ఉన్నా సరిపడా నిద్రలేకపోవ డం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. నిద్రలే మి అనేది ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా సమస్యకు కారణమవుతుంది. నిద్రలేమి వల్ల జీర్ణవ్యవస్థ కుంటుపడుతుంది. దాంతో మలబద్దకం సమస్య మొదలవుతుంది. ఈ స్థితి ఏళ్ల పర్యంతం కొన సాగితే అంతిమంగా ఇది పైల్స్ సమస్యకు దారి తీస్తుంది. అందువల్ల వెంటనే మీరు మీ మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజల వంటి పీచుపదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోండి. మాంసాహారం తగ్గించి, కూరగాయలు ఎక్కువగా తినండి.
పొగతాగడం, మద్యం సేవించడం లాంటి అలవాట్లుంటే సమస్య పెరుగుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎక్కువసేపు కూర్చుని ఉండకూడదు. ప్రస్తుత ఉపశమనం కోసం రోజూ రెండు సార్లు జాత్యాది ఘృతం అనే లేపనాన్ని పైపూతగా వాడండి. రోజూ పడుకోబోయే ముందు కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఆ తర్వాత క్రమంగా పైల్స్ సమస్య కూడా తొలగిపోతుంది. అప్పుడింక శస్త్రచికిత్సతో పనే ఉండదు. ఒకవేళ ఇప్పటికీ మీరు నిర్లక్ష్యంగానే ఉండిపోతే మందులు పనిచేయని స్థితి ఏర్పడుతుంది. ఒత్తిడి మరీ ఎక్కువై రక్తనాళాలు ఉబ్బి కిందికి జారితే అప్పుడింక ఆయుర్వేదంలోని క్షారసూత్ర విధానంలో పైల్స్ చికిత్స చేయవలసి ఉంటుంది. మీరు వెంటనే మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మీకు ఈ సమస్యే ఉండదు.
డాక్టర్ విఠల్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్
డాక్టర్ బి,.ఆర్. కె. ఆర్ ఆయుర్వేద వైద్య కళాశాల, హైదరాబాద్